అసెంబ్లీ సమావేశాల్లో ‘గిరిజన బందు’ను ప్రకటించాలి.రమావత్ శ్రీరాం నాయక్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తెలంగాణ గిరిజన సంఘం డిమాండ్
Khammamతెలంగాణ గిరిజన సంఘం ఖమ్మం జిల్లా 3 వ మహాసభల జయప్రదానికి కారేపల్లి లో ఆదివారం నాడు ఆహ్వాన సంఘం సమావేశం సర్పంచ్ బానోత్ బన్సీలాల్ అధ్యక్షతన జరిగింది. ఇందులో ముఖ్యఅతిథిగా ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమావత్ శ్రీరాం నాయక్, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు భూక్యా వీరభద్రం, బానోత్ బాలాజీ నాయక్, జిల్లా నాయకులు మూడ్ గన్యానాయక్, తేజావత్ కృష్ణ కాంత్ , అజ్మీరా శోభన్ నాయక్ , భూక్యా లక్ష్మణ్, గిరిజన సమాఖ్య జిల్లా అధ్యక్షులు బానోత్ భరత్ నాయక్, వైయస్సార్ టిపి వైరా కన్వీనర్ ధరమ్ సోత్ రాములు నాయక్, సర్పంచులు కురసం సత్యనారాయణ , ఎట్టి రామారావు ,వజ్జా రామారావు తదితరులు పాల్గొన్నారు.
సందర్భంగా ఆర్ శ్రీరామ్ నాయక్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అమలు చేస్తానన్న గిరిజన బందు పథకాన్ని వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన 9 సంవత్సరాల కాలంలో గిరిజనుల అభివృద్ధి సంక్షేమానికి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని విమర్శించారు. విభజన చట్టంలో భాగంగా ఏర్పాటు చేస్తామన్న గిరిజన యూనివర్సిటీ ,బయ్యారం ఉక్కు పరిశ్రమలను ఏర్పాటు చేయడంలో కేంద్రం బీజేపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు.గిరిజనులు సాగుచేస్తున్న పోడు భూముల హక్కులపై నీళ్లు చల్లే విధంగా కేంద్ర ప్రభుత్వం అడవులు, అటవీ సంపదను కార్పొరేట్లకు కట్టబెడుతూ అటవీ సంరక్షణ నియమాలు 2022 పేరుతో పార్లమెంట్లో నూతన చట్టం చేస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. చట్టం అమలు అయితే షెడ్యూల్ ప్రాంతం, అటవీ ప్రాంతాల్లో గిరిజన హక్కులు పూర్తిగా కాలరాయబడతాయని అన్నారు. కోట్లాదిమంది ఆదివాసి గిరిజనులు తమ భూములు కోల్పోయి బలవంతంగా అడవుల నుండి గెంటివేయబడతారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో గిరిజనులు పోరాడి సాధించుకున్న గిరిజన రిజర్వేషన్ జీవో 33 ను కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధత కల్పించి, తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. పెంచిన రిజర్వేషన్ ను సైతం అడ్డుకోవడానికి బిజెపి పార్టీ పార్లమెంట్ సభ్యులు సోయం బాబురావు వారి అనుచరులు సుప్రీంకోర్టులో కేసులు వేసి అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో గిరిజన రిజర్వేషన్ పెంపుపట్ల కేంద్ర బిజెపి ప్రభుత్వానికి మొదటి నుండి అభ్యంతరాలున్నాయని అందులో భాగంగానే ఇటువంటి కుట్రలకు పాల్పడుతోందని విమర్శించారు. లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని గిరిజన తెగల మధ్య బిజెపి ఎంపీ సోయం బాబురావు డిమాండ్ చేస్తూ ప్రధానమంత్రి మెమొరాండం ఇచ్చి గిరిజన తెగల మధ్య ఘర్షణలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని రాష్ట్ర బిజెపి నాయకులు కుట్రలు చేస్తున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పోడు భూములకు హక్కు పత్రాలు ఇస్తామని ఇవ్వకుండా జాప్యం చేస్తున్నదని . వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో పోడు భూములకు హక్కు పత్రాల పంపిణీకి కార్యాచరణ ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.