ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులలో నకిలీ వికలాంగులను గుర్తించాలి.సదరం సర్టిఫికెట్ ఉన్న ఉపాధ్యాయులకు ప్రాధాన్యత ఇవ్వాలి.
Warangalఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియలో నకిలీ వికలాంగులను గుర్తించి, సదరం సర్టిఫికెట్ ఉన్న ఉపాధ్యాయులకు ప్రాధాన్యత ఇవ్వాలని, 2016 వికలాంగుల చట్టం ప్రకారం నిజమైన వికలాంగ ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్పిఆర్డీ) రాష్ట్ర ఉపాధ్యక్షులు బిట్ల గణేష్ డిమాండ్ చేశారు.
దివి: 31-01-2023 మంగళవారం రోజున జనగామ పట్టణంలోని జిల్లా ప్రజాసంఘాల కార్యాలయంలో సంఘం జిల్లా అధ్యక్షులు పాముకుంట్ల చందు అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఎన్పిఆర్డీ జనగామ జిల్లా కమిటీ సమావేశానికి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బిట్ల గణేష్ ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడుతూ 2012 నుండి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా నకిలీ ఉపాధ్యాయ వికలాంగులు ఉన్నారని వారిని గుర్తించి, చర్యలు తీసుకోవాలనీ అనేక సార్లు ఉద్యమాలు, పోరాటాలు నిర్వహించి, జిల్లా ఉన్నతాధికారులకు వినతిపత్రాలు సమర్పించినప్పటికీ ఎటువంటి ప్రయోజనం జరగలేదన్నారు. శారీరక వికలాంగులకంటే చెవుడు, దృష్టిలోపం ఉన్న వారిలో ఎక్కువ మంది నకిలీలు ఉన్నారని ఆరోపించారు. 2012లో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా దొంగచెవుడు టీచర్ల దందాల్లో సస్పెండ్ అయ్యి, ఆ తర్వాత పెండింగ్ విచారణలో మళ్ళీ నియామకమైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. వికలాంగుల పేరిట మెడికల్ ధ్రువీకరణ పత్రాలు సంపాదించిన ఉపాధ్యాయులందరికి ముందస్తుగా స్థానిక జనగామ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి వైద్యులతో ఫిజికల్ వెరిఫికేషన్ చేయించాలన్నారు. సదరం సర్టిఫికెట్ ఉన్న ఉపాధ్యాయులకు పదోన్నతులు, బదిలీలలో ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. సదరం సర్టిఫికెట్ కాకుండా ఇతరత్రా మ్యానువల్ సర్టిఫికెట్లు సమర్పించే అవకాశం ఇవ్వొద్దని తెలిపారు. 2016 వికలాంగుల చట్టం ప్రకారం నిజమైన వికలాంగ ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు నీకిలీలను గుర్తించి, వారికి నకిలీ సర్టిఫికెట్ లు ఇచ్చిన డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని తెలిపారు. నకిలీలను గుర్తించకపోతే ఎన్పిఆర్డీ నకిలీ వికలాంగ ఉపాధ్యాయులను గుర్తిస్తుందని, అవసరం అయితే పోరాటం చేస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ తోట సురేందర్, జిల్లా ఉపాధ్యక్షులు మామిడాల రాజేశ్వరి, పిట్టల కుమార్, జిల్లా సహాయ కార్యదర్శులు బండవరం శ్రీదేవి, కొత్తపల్లి రమేష్, జిల్లా కోశాధికారులు ఇట్టబోయిన మధు, నామాల రాజు, జిల్లా కమిటీ సభ్యురాలు మోతే వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు.