నడిగడ్డకు మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదు
Uncategorizedఎర్రవల్లి,జోగులాంబ గద్వాల జిల్లా
తుమ్మిళ్ల ఎత్తిపోతల రిజర్వాయర్లు ఎప్పుడు పూర్తి చేస్తారు?:బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ డిమాండ్
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్,ఫామ్ హౌస్ వీడండి
నడిగడ్డకు మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదు
అలంపూర్ అభివృద్ధిపై చర్చకు సిద్ధమని కేసీఆర్ కు సవాల్
ఆర్డీఎస్ ఆయకట్టుకు గుండెకాయ లాంటి తుమ్మిళ్ల ఎత్తిపోతల పరిధిలోని కీలకమైన మల్లమ్మకుంట,జూలకల్,వల్లూరు రిజర్వాయర్లను ఎప్పుడు పూర్తి చేస్తారో నడిగడ్డ ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ సమాధానం చెప్పాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డా.ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. జోగులంబా గద్వాల జిల్లా ఎర్రవల్లి చౌరస్తాలో బుధవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.ఎన్నికల ముందు తుమ్మిళ్లు ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తానని నడిగడ్డ ప్రజలకు మాయమాటలు చెప్పిన కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత మోసం చేశాడని ధ్వజమెత్తారు.సీఎం స్వయంగా కేసీఆర్ మల్లమ్మకుంట రిజర్వాయర్ నిర్మాణానికి జీ.ఓ జారీ చేసినా పూర్తి కాలేదన్నారు. నడిగడ్డ రైతులు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న తుమ్మిళ్ల పరిధిలోని ఆర్డీఎస్ కాలువలు పూర్తి చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్,ఫామ్ హౌస్ వీడి ప్రజా సమస్యలు పరిష్కరించాలని సూచించారు.ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గమైన గజ్వేల్ లో ప్రతి ఊరుకి డబల్ బెడ్ రూంలు ఇచ్చిన కేసీఆర్ అలంపూర్ కు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. గజ్వేల్ లో 656 కోట్లు,సిద్దిపేటలో 714 కోట్లు ఖర్చు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ అలంపూర్ అభివృద్ధికి తొమ్మిది ఏళ్లలో కేవలం 20 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని విమర్శించారు. అలంపూర్ పై ముఖ్యమంత్రికి ఎందుకింత వివక్షని మండిపడ్డారు. అలంపూర్ అభివృద్ధికి ఎన్ని నిధులు ఖర్చు చేశారో తాను చర్చకు సిద్ధమని ముఖ్యమంత్రికి సవాలు విసిరారు.
తెలంగాణలో ఏం సాధించారని కేసీఆర్ దశాబ్ది ఉత్సవాలు జరుపుతున్నారని విమర్శించారు. కేసీఆర్ పాలనలో ప్రజలకు ఒరిగిందేమి లేదన్న ఆయన కేవలం కల్వకుంట్ల కుటుంబం మాత్రం తెలంగాణను దోపిడీ చేసిందన్నారు.
40 వేల కోట్లతో చేపట్టిన మిషన్ భగీరథ నీళ్లు నడిగడ్డ ప్రజలకు రావడం లేదన్న ఆయన కేవలం కాంట్రాక్టర్ల కమిషన్ల కోసమే మిషన్ భగీరథ ప్రవేశపెట్టారని ఆరోపించారు.చాలా గ్రామాల్లో త్రాగు నీరు రాక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని,అధికారులకు చెబితే పట్టించుకోవట్లదేని అన్నారు.విష వ్యర్ధాలు వెదజల్లుతూ ప్రజలను అనారోగ్యం పాలు చేస్తున్న జింకలపల్లి ఎస్ఎన్ఎస్ స్ట్రాచ్ కంపెనీ కంపెనీని తక్షణమే మూసివేయాలని డిమాండ్ చేశారు.అలంపూర్ నియోజకవర్గంలో చాలా గ్రామాలకు బస్సులు లేక విద్యార్థులు,మహిళలు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారని తెలిపారు.
అలంపూర్ ప్రాంతానికి చెందిన దివంగత దళిత ఐఏఎస్ జి.కృష్ణయ్య బీహార్ లో ఆనంద్ మోహన్ చేతిలో హత్యకు గురైతే, హంతకుడిని విడుదల చేయొద్దని బీహార్ ప్రభుత్వానికి లేఖ రాయడానికి ముఖ్యమంత్రికి తీరిక లేదని విమర్శించారు.125 అడుగులు డా.బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు కేవలం దళితుల ఓట్లను కొల్లగొట్టేందుకేనని ఆరోపించారు. దళితుల అభివృద్ధి పట్ల ఏమాత్రం చిత్తశుద్ధిలేని ముఖ్యమంత్రి కేసీఆర్ ను వచ్చే ఎన్నికల్లో ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో బిఎస్పీ జిల్లా అధ్యక్షుడు ఎం.సి కేశవరావు,జిల్లా ఇంచార్జ్ ఎం.జి.కృష్ణ నాయకులు మహేష్, సుంకన్న,కనకం బాబు తదితరులు పాల్గొన్నారు.