ఈ విద్యా సంవత్సరంలోనే ప్రారంభించాలని సీపీఎం డిమాండ్
ఈ విద్యా సంవత్సరంలోనే ప్రారంభించాలని సీపీఎం డిమాండ్
తెలుగు గళం న్యూస్ పాలకుర్తి, జూన్ 9
పాలకుర్తి మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాలను ప్రస్తుత విద్యా సంవత్సరంలోనే ఏర్పాటు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు రాపర్తి రాజు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.మంగళవారం గూడూరు గ్రామంలో నిర్వహించిన సీపీఎం మండల కమిటీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సమావేశానికి సీపీఎం మండల కమిటీ సభ్యుడు ఏదునూరి మదార్ అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా రాపర్తి రాజు మాట్లాడుతూ, పాలకుర్తి మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలలు లేకపోవడం వల్ల గ్రామీణ ప్రాంతాల పేద, మధ్యతరగతి విద్యార్థులు ఉన్నత విద్య కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రైవేట్ విద్యాసంస్థల అధిక ఫీజులు భరించలేక అనేక మంది విద్యార్థులు చదువులకు దూరమవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని విమర్శించారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక వసతులు, సిబ్బంది కొరత, అవసరమైన సదుపాయాల లేమితో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాల్సిన ప్రభుత్వాలు కార్పొరేట్ విద్యాసంస్థలకు ప్రోత్సాహం అందిస్తూ ప్రైవేట్ విద్యా రంగానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. ఫీజుల నియంత్రణలో ప్రభుత్వాలు విఫలమవడంతో తల్లిదండ్రులపై ఆర్థిక భారం పెరిగి అనేక కుటుంబాలు అప్పుల పాలవుతున్నాయని అన్నారు.వైద్య రంగంలోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోందని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సిబ్బంది, ఆధునిక పరికరాలు, మౌలిక సదుపాయాల కొరత కారణంగా ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించాల్సి వస్తోందన్నారు. ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని కార్పొరేట్ ఆసుపత్రులు ప్రజలపై భారీ ఆర్థిక భారం మోపుతున్నాయని విమర్శించారు.ఈ నెల 13, 14, 15 తేదీలలో బచ్చన్నపేట మండల కేంద్రంలో నిర్వహించనున్న రాజకీయ శిక్షణ తరగతులను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. విద్య, వైద్యం రంగాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై సర్వేలు నిర్వహించి, వాటి ఆధారంగా దశలవారీ ఉద్యమాలు చేపట్టి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.విద్య, వైద్యం, వ్యవసాయం, రైతుల సమస్యల పరిష్కారం కోసం రాబోయే రోజుల్లో పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు.ఈ సమావేశంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు చిట్యాల సోమన్న, మండల కార్యదర్శి మాచర్ల సారయ్య, మండల కమిటీ సభ్యులు మాసంపల్లి నాగయ్య, ఏదునూరి మదార్, బెల్లి సంపత్ తదితరులు పాల్గొన్నారు.