మణిపూర్ లో ఆదివాసీ గిరిజనులపై మతోన్మాద దాడులను ఖండించండి
Uncategorized-ఆవాజ్
మణిపూర్ లో ఆదివాసీ కుకీ, నాగ గిరిజన తెగలపై జరుగుతున్న దాడులను ఆవాజ్ తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నది. గిరిజనులపై దాడులు ఆపడానికి కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని, దాడులకు పాల్పడుతున్న మతోన్మాదులను కఠినం శిక్షించాలని డిమాండ్ చేస్తున్నది.
మణిపూర్ రాష్ట్రం గత రెండు మాసాలుగా కుకీ,నాగ ఆదివాసీ గిరిజన తెగలపై మతోన్మాద శక్తుల దాడులతో అట్టుడుకుతోంది. కేంద్రంలో, మణిపూర్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బిజెపి గిరిజనులపై దాడులను అరికట్టడంలో ఘోరంగా విఫలం అయ్యింది.
ఈ మధ్యే జరిగిన మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి గెలిచి అధికారం చేపట్టింది. రాష్ట్ర జనాభాలో మెజారిటీగా ఉన్న మైతీ కులస్తులలో తమ బలాన్ని సుస్థిరం చేసుకోవడానికి బిజెపి చేస్తున్న కుట్రలో భాగంగానే మణిపూర్ లో కుకీ, నాగ ఆదివాసీ గిరిజన తెగలపై దాడులను చూడాలి. బిజెపి తన రాజకీయ లబ్దికోసం రాష్ట్ర జనాభాలో 54శాతం ఉన్న మైతీ కులస్తులను గిరిజన తెగల జాబితాలో చేర్చడానికి ప్రయత్నం చేస్తున్నది. తద్వారా రాష్ట్ర జనాభాలో మైనారిటీగా ఉన్న కుకీ, నాగ గిరిజన తెగల హక్కులను దెబ్బతీయాలని చూస్తోంది. అడవిలో జీవిస్తున్న కుకీ, నాగ తెగలను అడవి నుండి గెంటివేయాలని, వీరి స్వాధీనంలో ఉన్న భూములను గిరిజనేతరులైన మైతీలకు కట్టబెట్టాలని, అందుకు ఆటంకంగా ఉన్న గిరిజన చట్టాలను అతిక్రమించడానికి మైతీలను గిరిజనులుగా మార్చే ప్రయత్నాలకు బిజెపి తెరతీసింది. దీనిని ప్రతిఘటించిన కుకీ, నాగ గిరిజన తెగలపై బిజెపి అండతో మతోన్మాద శక్తులు దాడులకు పాల్పడుతున్నాయి. గిరిజనుల ఇళ్ళను, ఆస్తులను, చర్చీలను ధ్వంసం చేశారు. 70మందికి పైగా అల్లర్లలో చనిపోయారు. రాకపోకలు నిలిచిపోయాయి. ఇంటర్నెట్ సేవలు నిలిపివేయబడ్డాయి. బిజెపి తన రాజకీయ లబ్దికోసం శాంతియుతంగా కలిసి మెలిసి జీవిస్తున్న గిరిజన, గిరిజనేతర ప్రజలమధ్య చిచ్చు పెట్టింది. మణిపూర్ రాష్ట్రాన్ని అగ్ని గుండంగా మార్చింది.
మణిపూర్ ఆదివాసీ గిరిజనులపై బిజెపి అండతో జరుగుతున్న జాతిఉన్మాద, మతోన్మాద దాడులను ప్రజలంతా తీవ్రంగా ఖండించాలి. కుకీ, నాగ ఆదివాసీ గిరిజన తెగలపై మతోన్మాద శక్తుల దాడులను అరికట్టేందుకే తక్షణం చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరుతున్నాం.