మహిళలు సమాజానికి ఆదర్శంగా నిలవాలి-అహ్మదీయ ముస్లిం మహిళా జిల్లా అధ్యక్షురాలు సఫియా బేగం
TELUGU NEWSతెలుగు గళం అర్వపల్లి
మహిళలు సమాజానికి ఆదర్శంగా నిలవాలని అలాగే వంటింటికే పరిమితం కాకుండా చైతన్యవంతులై అన్ని రంగాల్లో రాణించాలని అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీ ఉమ్మడి నల్గొండ జిల్లా మహిళా అధ్యక్షురాలు సఫియా బేగం అన్నారు.సూర్యపేట జిల్లా అర్వపల్లి మండలం కాసర్లపహాడ్ గ్రామంలో అహ్మదీయ కమ్యూనిటీ మహిళా విభాగం ఆధ్వర్యంలో జిల్లా వార్షిక ఇజ్తిమా(సమావేశం)ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా సఫియా ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.ప్రస్తుత సమాజంలో మహిళలు తమకు లభించే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగాలన్నారు.ఒడిదుడుకులు ఎదురైనా వెనుకంజ వేయకుండా తాము ఎంచుకున్న లక్ష్యం దిశగా అడుగులు వేయాలని,సమాజంలో ఉన్నత స్థానంలో నిలిచినపుడే మంచి గుర్తింపు లభిస్తుందన్నారు.మనం చేసే పని ఇతరులకు ఆదర్శంగా నిలవాలని,సమాజాభివృద్ధిలో భాగస్వాములు కావాలని సూచించారు.నేటికి పదిహేను వందల సంవత్సరాలకు పూర్వం సమాజంలో మహిళల పట్ల వివక్షత ఉండేదని జగత్ ప్రవక్త హజ్రత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సమాజంలో సమాన హక్కులు కల్పించి యావత్ మహిళా లోకానికి వెల కట్టలేని ఉపకారం చేసి ఆదర్శంగా నిలిచారని అన్నారు.దానికి అహ్మదీయ ముస్లిం మహిళలే ఉదాహరణ అని పేర్కొన్నారు.మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ది చెందినప్పుడే,సమాజ అభివృద్ది జరుగుతుందని మహిళల వల్లనే సంస్కరణలు
సాధ్యమని పేర్కొన్నారు.అనంతరం మహిళా ఉపాధ్యక్షురాలు ఆఫ్సానా బేగం మాట్లాడుతూ..ఇస్లాం ధర్మంలో మహిళలకు చాలా గౌరవ స్థానం ఉన్నదని,ఇస్లాంకు పూర్వం స్త్రీకి ఎలాంటి ప్రాధాన్యత ఉండక పోయేదని అన్నారు.ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్త్రీలకు సమాజంలో ఉన్నత స్థానం కల్పించారన్నారు.తల్లికి సేవ చేసినచో స్వర్గం లభిస్తుందని,మరియు కూతుర్లకు మంచి విద్యాబుద్ధులను నేర్పి వివాహం చేసినచో ఆ తండ్రికి స్వర్గం లభిస్తుందని,భార్యతో సరియైన పద్ధతిలో నడుచుకున్నచో ఉత్తమమైన వ్యక్తిగా పరిగణించబడుతారని ముహమ్మద్ ప్రవక్త స అ స అన్నారని తెలిపారు.మహిళలు ఆ స్థానాన్ని గౌరవిస్తూ ఆధ్యాత్మికంగా,ఆర్థికంగా,సమాజ పరంగా అన్ని రంగాల్లో ఎదగాలని తమ సంతానానికి ఉత్తమ పద్ధతిలో శిక్షణ ఇవ్వాలని అన్నారు.అనంతరం మహిళలకు,బాలికలకు విద్యా,క్రీడా పోటీలు నిర్వహించి బహుమతులు ప్రధానం చేశారు.ఈ సమావేశంలో కాసర్లపహాడ్ గ్రామ అధ్యక్షురాలు నూర్జహాన్,బండ్లపల్లి అధ్యక్షురాలు ముహమ్మద్ రజియా,చిల్పకుంట్ల అధ్యక్షురాలు షేఖ్ మహబూబ్ బీ,నజీమా,యాకూబ్బీ,ఖైరున్నిసా,రజియా,తన్వీర్,రిజ్వానా,షాహీన్,ఆశ్రాఫుల్ హుదా,సయీదా బీ మరియు జిల్లా వివిధ గ్రామాల నుండి అధిక సంఖ్యలో మహిళలు బాలికలు పాల్గొన్నారు.