జర్నలిస్టుల సమస్యలను తక్షణం పరిష్కరించాలి
తమ దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జర్నలిస్టులు సోమవారం హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ లోని రాష్ట్ర సమాచార శాఖ కమీషనరేట్ (సమాచారభవన్) ఎదుట ధర్నా నిర్వహించారు.తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) ఆధ్వర్యంలో జరిగిన ఈ ధర్నాలో ప్రింట్,ఎలక్ట్రానిక్ మీడియాలకు చెంది అనేక మంది జర్నలిస్టులు పాల్గొన్నారు.రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని జర్నలిస్టులు ముక్తకంఠంతో నిరసించారు.సమస్యలను పరిష్కరించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.ఈ సందర్భంగా ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు,రాష్ట్ర కన్వీనింగ్ కమిటీ కన్వీనర్ మామిడి సోమయ్య ధర్నానుద్దేశించి మాట్లాడుతూ..రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేండ్లు కావస్తున్నా…జర్నలిస్టుల సమస్యలు ఏ ఒక్కటీ పరిష్కరించలేదని,కనీసం కొత్త అక్రెడిటేషన్ కార్డులు ఇచ్చే పరిస్థితిలో ప్రభుత్వం లేదని అన్నారు.జర్నలిస్టులకు ఇస్తామన్న ఇళ్లస్థలాల ఊసే లేదని, కోర్టు తీర్పు సాకుతో ప్రభుత్వం కాలయాపన చేస్తుందని అన్నారు.ఆరోగ్య భీమా పథకాన్ని అటకెక్కించారని,చిన్న మధ్య తరహా పత్రికలను సంక్షోభంలో పడేసారని మామిడి సోమయ్య ధ్వజమెత్తారు.జర్నలిస్టులకు గత ప్రభుత్వం తీరని అన్యాయం చేసిందంటే…అంతకంటే ఎక్కువగా ఈ ప్రభుత్వం అన్యాయం చేస్తోందని అన్నారు.జర్నలిస్టుల సమస్యలను త్వరగా పరిష్కరిస్తామంటూ ముఖ్యమంత్రి,సమాచార శాఖ మంత్రి పలు మార్లు హామీలిచ్చారే తప్ప ఆచరణలో పెట్టలేదని,చివరికి జర్నలిస్టుల ప్రతినిధిగా ఉన్న మీడియా అకాడమీ ఛైర్మన్ కూడా కమిటీల పేరుతో కాలయాపన చేసి చివరికి చేతులెత్తేశారని విమర్శించారు.సుప్రీకోర్టు తీర్పును సాకుగా చూపుతూ జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వడం లేదని,ఇది చాలా అన్యాయమని,ప్రత్యామ్నాయ జీవో ద్వారా జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.జర్నలిస్టుల సమస్యలలో ప్రధానమైన ఇండ్ల స్థలాలు,అక్రెడిటేషన్ కార్డులు,హెల్త్ కార్డులతో పాటు జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్,కార్పొరేట్ స్కూళ్ళలో ఉచిత విధ్య,సీనియర్ జర్నలిస్టులకు పెన్షన్,మహిళా జర్నలిస్టులకు ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని,చనిపోయిన జర్నలిస్టు కుటుంబానికి ప్రభుత్వం ఇస్తున్న లక్ష రూపాయల సహాయాన్ని రూ.10 లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు.చిన్న పత్రికలను ఎంపానెల్ లో చేర్చాలని,అడ్వర్టయిజ్మెంట్ పెంటింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని మామిడి సోమయ్య కోరారు.ఈ ధర్నాలో ఫెడరేషన్ రాష్ట్ర కన్వీనింగ్ కమిటీ కో-కన్వీనర్లు పులిపలుపుల ఆనందం,వల్లాల జగన్,బండి విజయ్ కుమార్,తన్నీరు శ్రీనివాస్,ఆర్.వెంకటేశ్వర్లు,కుడుతాడి బాపురావు,ఎం.యాదగిరి,కె.పాండురంగారావు,వివిధ జిల్లాల నాయకులు కంతేటి రమాదేవి,పద్మనాభరావు,ఉదయ్ భాస్కర్ రెడ్డి,గిరిబాబు,అక్బర్ పాషా,పంతాటి రవీందర్,పి.గోపాల్,ఎం.గోపాల్,జక్కుల విజయకుమార్,స్వామిదాస్,మిట్టపల్లి మధు,సత్యగౌడ్,సత్యనారాయణ,శ్రీనివాస్ గౌడ్,పర్వతాలు,నీల నరేష్ ,మల్లేష్,అశోక్,శంకర్,డప్పు రామస్వామి,శాంతి,సౌభాగ్యవతి,సుష్మ,మంజులారెడ్డి,శివపార్వతి తదితరులు పాల్గొన్నారు.అనంతరం సమాచార పౌరసంబధాల శాఖ కమీషనర్ కు ఇచ్చే వినతి పత్రాన్ని జాయింట్ డైరెక్టర్ డీ ఎస్ జగన్ కు అందజేశారు.జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కరించేందుకు కృషి చేస్తానని జగన్ హామీ ఇచ్చారు.