ప్రైవేట్ పాఠశాలల ఫీజులను నియంత్రించాలి డీఈవోకు ఏబీవీపీ వినతి
– ప్రైవేట్ పాఠశాలల ఫీజులను నియంత్రించాలి డీఈవోకు ఏబీవీపీ వినతి
తెలుగు గళం న్యూస్ హైదరాబాద్, జూన్ 9
ప్రభుత్వ పాఠశాలల సమస్యలను వెంటనే పరిష్కరించి, ప్రైవేట్ పాఠశాలల ఫీజుల నియంత్రణకు కఠిన చర్యలు చేపట్టాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) రంగారెడ్డి జిల్లా శాఖ జిల్లా విద్యాశాఖ అధికారికి (డీఈవో) వినతిపత్రం సమర్పించింది.ఈ సందర్భంగా ఏబీవీపీ స్టేట్ వర్కింగ్ కమిటీ సభ్యుడు సాయి చరణ్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో సరైన మౌలిక వసతులు లేకపోవడం వల్ల విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాల శాతం క్రమంగా తగ్గుముఖం పడుతుండటం ఆందోళనకరమని పేర్కొన్నారు.ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసి అవసరమైన మౌలిక వసతులు కల్పించడంతో పాటు విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.ప్రైవేట్ పాఠశాలలు విద్యను వ్యాపారంగా మార్చి విద్యార్థుల తల్లిదండ్రులపై అధిక ఆర్థిక భారం మోపుతున్నాయని సాయి చరణ్ విమర్శించారు.యూనిఫాంలు, బస్సు ఫీజులు, పుస్తకాల ఫీజులు, ప్రత్యేక ఫీజులు తదితర పేర్లతో వేల నుంచి లక్షల రూపాయల వరకు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఎల్కేజీ నుంచి ఉన్నత తరగతుల వరకు చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.ప్రైవేట్ పాఠశాలల ఫీజులపై ప్రభుత్వం కఠిన నియంత్రణ చర్యలు తీసుకుని విద్యాశాఖ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని కోరారు. అలాగే ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించి విద్యార్థులకు మెరుగైన విద్యా అవకాశాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ పయ్యంశెట్టి జగదీష్ పటేల్, ఏబీవీపీ ఎల్బీ నగర్ జిల్లా కన్వీనర్ వినయ్, నగర కార్యదర్శి నితిన్ తదితరులు పాల్గొన్నారు.