అంబేద్కర్ విగ్రహం దగ్గర స్వేచ్ఛ JAC మానవహారం
Hyderabadఈరోజు హైదరాబాద్ టాంక్ బండ్ దగ్గర అంబేద్కర్ విగ్రహం చుట్టూ రాజ్యాంగాన్ని కాపాడుకుంటాం భావప్రకటనా స్వేచ్ఛా హక్కు ను కాపాడుకుంటామని నినదిస్తూ వివిధ పార్టీలు, ప్రజా సంఘాలు వందకు పైగా సంస్థల ప్రతినిధులు మానవహారం ఏర్పాటు చేసారు.
ఈ కార్యక్రమంలో CPIM పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు, CPI నాయకులు పాండురంగాచారి, CPI ML న్యూ డెమోక్రసీ నాయకులు సాధినేని వెంకటేశ్వరరావు, ఝాన్సీ, గోవర్ధన్, సంధ్య POW, స్వరూప POW, జ్యోతి CMD, ప్రకృతి కవి జయరాజు, బిసి సంక్షేమ సంఘం కోల జనార్ధన్, KVPS జాన్ వెస్లీ, స్కైలాబ్ బాబు, కుల నిర్మూలన సంఘం వహీద్, మానవవికాస వేదిక తుమ్మా భాస్కర్, విజ్ఞానదర్శిని శోభారాణి, గిరిజన సంఘం నాయకులు శ్రీరాం నాయక్, ప్రదీప్ PYL, జైభీం సేన అంజన్న,DYFI వెంకటేష్, భారత నాస్తిక సమాజం మల్లేశం తదితరులు పాల్గొన్నారు.
అభ్యుదయవాదులు, అంబేద్కర్ వాదులు, టీచర్లు, హేతువాదులు, నాస్తికులపై రాష్ట్రంలో మతోన్మాదుల మూకదాడులను అరికట్టాలి – దుండగులను చట్టప్రకారం శిక్షించాలి – బాధితులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తి వేయాలి. అని నినాదాలు చేసారు.
వక్తలు మాట్లాడుతూ భావ ప్రకటన స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించిన హక్కు దానిని కాపాడుకోవడం పౌరులందరి బాధ్యత. ఎవరైనా ఏదైనా చట్ట వ్యతిరేకంగా లేదా చట్ట విరుద్ధంగా మాట్లాడిన ప్రవర్తించిన చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి తప్ప ఎవరు కూడా చట్టాన్ని చేతిలోకి తీసుకోకూడదు. ఎవరు ఎవరిపైన దాడులకు పాల్పడరాదు.
తెలంగాణ రాష్ట్రంలో మతాన్ని అడ్డుపెట్టుకొని అధికారంలోకి రావాలని ఆరాటపడుతున్న మతోన్మాద RSS రాజకీయ శక్తులు ఆడుతున్న రాజకీయ వికృత క్రీడనే నేడు అభ్యుదయవాదులు, అంబేడ్కర్ వాదులు, హేతువాదులు, నాస్తికులు, బహుజనులపై జరుగుతున్న ఈ దాడులు.
మహారాష్ట్రలో డా.నరేంద్ర దభోల్కర్, డా.గోవింద్ పన్సారే, కర్నాటకలో ప్రొ.ఎం.ఎం. కల్బుర్గి, గౌరి లంకేష్ ల హత్యలతో ఆడిన రాజకీయ వికృత క్రీడను నేడు తెలంగాణ రాష్ట్రంలో ఈ మూకదాడులు.
హేతువాదం, నాస్తికత్వం, భౌతిక వాదం చార్వాకులు లోకాయతులు, బుద్ధుడి నుండి మహాత్మ జ్యోతిబాపూలే, సావిత్రిబాయి, బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, భగత్‌సింగ్ లు అందించిన భారతీయ తాత్విక వారసత్వం.
మానవ మనుగడకు పురోగమనానికి మూలం ప్రశ్నించే తత్వం. ప్రశ్న లేకపోతే మానవ ప్రగతి లేదు. నేడు ఆ ప్రశ్ననే దాడులకు గురవుతున్నది. హత్య చేయబడుతున్నది. భారత రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడే బాధ్యతను గుర్తు ఎరిగిన ప్రజాతంత్ర వాదులం, వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా, పౌర సంస్థల రాజ్యాంగ హక్కులను కాపాడుకోవడానికి కలిసి ఐక్యంగా కృషి చేయడానికి స్వేచ్ఛ JAC ఏర్పడింది. ఇందుకోసం రాజ్యాంగబద్ధంగా, చట్ట ప్రకారంగా మా కార్యాచరణ ఉంటుంది.
ఎవరు మాట్లాడిన వాటిల్లోనైనా ఏవైనా చట్ట వ్యతిరేకంగా ఉంటే చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలి. న్యాయస్థానాల తీర్పు ప్రకారం వ్యవహరించాలి. దానికి విరుద్ధంగా దాడులకు పాల్పడడం చట్ట వ్యతిరేకమే కాక రాజ్యాంగ వ్యతిరేకం.
ఎన్నో ఏళ్లుగా నాస్తికత్వాన్ని ప్రచారం చేస్తున్న బైరి నరేష్ పై, పాటలు పాడుతున్న రేంజర్ల రాజేష్ పై మతోన్మాదం, మనువాదం దాడులను చేస్తున్నది.
నిజామాబాద్ జిల్లా బోధన్ ప్రాంతంలోని కోటగిరి గ్రామంలో పాఠశాలలో పనిచేస్తున్న దళిత టీచర్ మల్లికార్జున్ ను అత్యంత దారుణంగా అవమానించి, తన నమ్మకాలకు విరుద్ధంగా గుడిలోకి తీసుకెళ్లి బలవంతంగా క్షమాపణలు చెప్పించి బొట్టుపెట్టి రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించి చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టాలి.
ప్రొ.సూరేపల్లి సుజాత, POW సంధ్య, మహిళా మరియు ట్రాన్స్ జెండర్ల సంఘాల ఐక్యవేదిక నాయకురాలు సజయ, సామాజిక కార్యకర్త దేవి, తదితరులపై బూతులతో మతోన్మాదులు చేస్తున్న దాడులను అరికట్టాలి.
ఫేస్బుక్లో పోస్టులు పెట్టినందుకు, వాట్సాప్ లో చర్చలు చేసినందుకు, వాట్సాప్ పర్సనల్ స్టేటస్ పెట్టుకున్న అనేక మందిని బెదిరిస్తూ వారి ఇండ్ల దగ్గరకు వెళ్లి దాడులు చేస్తున్నారు. ఇటీవల మహబూబ్‌నగర్ బూత్పూర్ SI బాధితుడి పైనే కేసు పెట్టడం రాజ్యాంగ వ్యతిరేకం.
భావప్రకటనా స్వేచ్ఛ రాజ్యాంగ హక్కు కు విరుద్ధంగా తానే తీర్పులు చెప్పే విధంగా వ్యవహరించి అరాచకశక్తులను రెచ్చగొట్టి దాడులకు పాల్పడేలా చేసిన మీడియాపై కూడా చట్ట ప్రకారం కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాం.
అభ్యుదయవాదులు, అంబేద్కర్ వాదులు, టీచర్లు, భౌతిక వాదులు, వైజ్ఞానికప్రచారకులు, హేతువాదులు, నాస్తికులపై రాష్ట్రంలో RSS మతోన్మాదుల మూకదాడులను అరికట్టాలి. దుండగులను చట్టప్రకారం శిక్షించాలి.
బాధితులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తి వేయాలి. అని అన్నారు.