అదాని కంపెనీలపై దాడులు లేవా?
Jangaonదేశంలో రాజ్యాంగం స్థానంలో మనుధర్మ శాస్త్రం అమలు చేయాలని బీజేపీ లక్ష్యమని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించే లక్ష్యంతో బిజెపికి వ్యతిరేకంగా ప్రజలను సమీకరించేందుకే సిపిఎం రాష్ట్రవ్యాప్తంగా జనచైతన్య యాత్రలను నిర్వహిస్తుందని, రాష్ట్ర ప్రజలు ఈ యాత్రలను జయప్రదం చేయాలని సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండి. అబ్బాస్ పిలుపునిచ్చారు.
దివి: 06-03-2023 సోమవారం రోజున జనగామ జిల్లా కేంద్రంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి అధ్యక్షతన పార్టీ జిల్లా కమిటీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎం.డి.అబ్బాస్ ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడుతూ 2023 మార్చి 17, 23, 24 తేదీలలో దేశాన్ని రక్షించుకొనేందుకు బీజేపీని పాతరేసేందుకే సిపిఎం జనచైతన్య యాత్రలను నిర్వహించడం జరుగుతుందని అన్నారు. దేశవ్యాప్తంగా ధరలు పెంచి ప్రజల బతుకులు ఆగం చేస్తున్న బీజేపీని తెలంగాణలో అడ్డుకోవాలని తెలిపారు. పార్లమెంట్ లో ప్రతిపక్ష పార్టీల నాయకులపై, సంస్థలపై, వ్యక్తులపైన ఈడీ, సీబీఐ దాడులు జరుగుతున్నాయి తప్ప, ప్రధానమంత్రి మోడీ అనుచరుడైన అదాని, అతని సంస్థలపై దాడులు ఎందుకు లేవని ప్రశ్నించారు? దేశంలో రోజురోజుకూ బీజేపీ నియంతృత్వ విధానాలు పెరిగిపోతున్నాయని, అందులో భాగంగానే మీడియా సంస్థలపై దాడులు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2023-24 బడ్జెట్ లో ప్రకృతివైపరీత్యాల పరిహారం, స్థానిక సంస్థల నిధులు, మున్సిపాలిటీలకు ఇచ్చే నిధులు, ఉన్నత విద్య, ఆరోగ్యం తదితర రంగాలకు కేంద్రం నుండి రావాల్సిన నిధుల్లో రాష్ట్రానికి కోత పెట్టారన్నారు. రాష్ట్రంలో సాగునీటి వనరులకు నిధులు ఇవ్వాలని కోరినప్పటికీ కేంద్ర ప్రభుత్వం నిరాకరిందని తెలిపారు. కేంద్రం రాష్ట్రంపై కక్ష్యపూరిత వైఖరితో వ్యవహరిస్తున్నట్లు ఈ బడ్జెట్లో స్పష్టమైందని విమర్శించారు. ఉపాధిహామి పథకానికి 2022-23లో 89,400 కోట్లు కేటాయించగా 2023-24 బడ్జెట్లో 60,000 కోట్లకే పరిమితం చేశారని, గ్యాస్‌పై సబ్సిడీని తగ్గించారన్నారు. ఆకలి సూచికలో భారతదేశం 191 దేశాల్లో 140వ స్థానాన్ని ఆక్రమించింది. విద్యలో 33వ స్థానం, ఆరోగ్యంలో 66వ స్థానం ఉన్న దేశం అభివృద్ధి కావడానికి ప్రస్తుత బడ్జెట్ సహకరిస్తుందా అని విమర్శించారు. ప్రజలు దారిద్య్రంలోకి వెళుతున్నప్పటికీ కార్పొరేట్లకు మాత్రం ఎన్.పి.ఏల పేరుతో రు.12లక్షల కోట్లు రుణాలు రద్దు చేశారని తెలిపారు. కేంద్ర ఆర్ధికమంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్ పేదరికాన్ని రూపుమాపేదిగా లేదని ఇది తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేసే విధంగా వున్నదని అన్నారు. కార్పొరేట్ మతోన్మాద రాజకీయాలతో ప్రజలను విచ్చినం చేస్తున్న బిజెపి ఓటమితోనే బెటర్ ఇండియా సాధ్యమవుతుందని అన్నారు. ప్రజల సొత్తును లూటీ చేసిన అదానీ తాలుకు ఆస్తులను కేంద్ర ప్రభుత్వం తక్షణం సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. గతంలోనూ దేశంలో అవినీతి సంఘటనలు చోటుచేసుకున్నాయి. కానీ, ఈ స్థాయిలో ప్రజాధనాన్ని లూటీ చేయడం ఇదే మొదటి సారని అన్నారు. అక్రమాలతో ఎల్.ఐ.సి తోపాటు అనేక ప్రభుత్వరంగ బ్యాంకులు ప్రమాదంలో పడ్డాయన్నారు. కేంద్ర ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ది ఉన్నా ప్రజల కష్టార్జితాన్ని కాపాడేందుకు పోర్టులు, ఎయిర్ పోర్టులు వంటి అదాని ఆస్తులను తక్షణం సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. గత ఎన్నికల ముందు ప్రజలకు మోడీ ఇచ్చిన హామీలు ఏ ఒక్కటీ నెరవేరలేదని విమర్శించారు. దేశంలో మతతత్వ దాడులు పెరిగాయని, హత్యలు, లైంగికదాడులు జరుగుతున్నా మోడీ స్పందించకపోవడం సిగ్గుచేటు అన్నారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం రాజ్యాంగ సంస్థలను నిర్వీర్యం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పోడు భూముల సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. 2022 వరకు దేశంలో ఇండ్లు లేని పేదవారు ఉండరని చెప్పిన ప్రధాన మంత్రి ఇప్పటివరకు ఎన్ని ఇండ్లు కట్టించారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దేశ వ్యాప్తంగా ఆరెస్సెస్, బీజేపీలు విద్వేష రాజకీయాలకు పాల్పడుతున్నాయని చెప్పారు. ఎర్రజెండా, వామపక్షాలు మాత్రమే రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, లౌకికకత్వాన్ని, పౌరహక్కులను, మైనార్టీ ప్రజల హక్కులను, సామాజిక న్యాయం పరిరక్షణ కోసం పాటుపడతామని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎదునూరి వెంకట్రాజం, ఇర్రి అహల్య, రాపర్తి రాజు, రాపర్తి సోమయ్య, సింగారపు రమేష్, బోట్ల శేఖర్, జిల్లా కమిటీ సభ్యులు బూడిది గోపి, జోగు ప్రకాష్, సుంచు విజేందర్, బోడ నరేందర్, బి. చందు నాయక్, చిట్యాల సోమన్న, ఎండి. షబానా, మునిగేల రమేష్ తదితరులు పాల్గొన్నారు.