ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రమాదం పొంచి ఉంది, విద్యార్థులు బయటికి రావద్దు
Uncategorizedవిద్యార్థుల పట్ల సంబంధిత అధికారులు అప్రమత్తంగా ఉండాలి
— ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి రాహుల్, ఏ ఎస్ పి అంకిత్
భద్రాచలం: తుఫాన్ ప్రభావం వలన వర్షాలు జోరుగా కురుస్తున్నందున ఆశ్రమ పాఠశాల, వసతి గృహాలలో చదువుతున్న గిరిజన విద్యార్థినీ విద్యార్థుల పట్ల సంబంధిత హెచ్ఎంలు, వార్డెన్లు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకొని పిల్లలను ఎవరిని వాగులు, వంకల దగ్గరకు వెళ్లకుండా చూడవలసిన బాధ్యత మీ పైన ఉందని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ అన్నారు.
భద్రాచలం లోని కూనవరం రోడ్డులో ఉన్న గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలోని ప్రహరీ గోడ రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు కూలిపోయిందని, సమాచారం తెలిసిన వెంటనే ఏ ఎస్ పి అంకిత్ తో కలిసి ఆశ్రమ పాఠశాలను సందర్శించి సంబంధిత హెచ్ఎం ను వివరాలు అడిగి తెలుసుకున్న అనంతరం ఆయన మాట్లాడుతూ వర్షాభావ పరిస్థితులు ఎక్కువగా ఉన్నందున విద్యార్థులను ఎవరిని ప్రహరీ గోడల వైపు, పాడైపోయిన పాఠశాల గదుల వైపు వెళ్లకుండా చూడాలని అన్నారు. అలాగే పాఠశాల పైన వర్షపు నీరు నిలిచి ఉంటే వెంటనే సిబ్బందితో తొలగించాలని, పాఠశాల పరిసరాలలో వర్షపు నీరు నిల్వ ఉండకుండా చూడాలని అన్నారు. వంట చేస్తున్న పక్కనే గోడ కూలిపోవడంతో ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదని, వెంటనే వంటశాలను మార్చేసి వేరే దగ్గర ఏర్పాటు చేసుకోవాలని హెచ్ఎం కి సూచించారు. అలాగే పాఠశాలలో కరెంటు వైర్లు మరియు స్విచ్ బోర్డులు అన్ని కరెక్ట్ గా ఉన్నది, లేనిది చూసుకోవాలని, గోడలపై నీటి చెమ్మ (తడిగా) కనుక ఉంటే పిల్లలు అటువైపు వెళ్ళకుండా చూడాలని, టాయిలెట్లు, బాత్రూంలు శుభ్రంగా ఉండే విధంగా చూసుకోవాలని, వర్షాలకు విషపూరితమైన క్రిమి, కీటకాలు, పాములు సంచరించే అవకాశం ఉన్నందున రాత్రిపూట పిల్లలు బయటికి రాకుండా చూడాలని అన్నారు. అనంతరం పిఎంహెచ్ వసతి గృహాన్ని పరిశీలించి పిల్లల పట్ల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని వార్డెన్ కు సూచించారు. కూలిపోయిన ప్రహరీ గోడను సాయంత్రం వరకు తాత్కాలికంగా గోడ నిర్మించాలని, గోడకు సంబంధించిన కొలతలు తీసుకొని దాని ప్రతిపాదనలు సమర్పించాలని, త్వరలో శాశ్వతంగా గోడ నిర్మాణం జరగాలని డీఈ ఏఈ లకు ఆదేశించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని గిరిజన సంక్షేమ శాఖ పాఠశాలల్లో పనిచేస్తున్న హెచ్ఎంలు, వార్డెన్లు, ఉపాధ్యాయులు వర్షాకాలం సీజన్ అయిపోయే వరకు పిల్లల పట్ల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకొని వారి చదువుకు ఆటంకం కలగ కుండా చూడవలసిన బాధ్యత మీ అందరి పైన ఉందని, పిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. పిల్లలు ఎవరు బయటికి వెళ్లకుండా పాఠశాల సిబ్బంది 24 గంటలు కనిపెడుతూ ఉండాలని, ఆశ్రమ పాఠశాలలో కానీ, వసతి గృహాలలో కానీ విద్యార్థిని విద్యార్థులకు ఎటువంటి ప్రమాదాలు జరిగిన సంబంధిత హెచ్ఎంలు వార్డెన్ ఉపాధ్యాయులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం సుభద్ర, పి ఎం హెచ్ పాఠశాల వార్డెన్ అనిత, వెంకట్, డి ఈ హరీష్, ఏఈ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.