పెండింగ్ స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ విడుదలకై కదం తొక్కిన విద్యార్థి లోకం.
మూడేళ్లుగా పెండింగ్ లో ఉన్న ఫీజు బకాయిలు 4000 కోట్ల రూపాయలను విడుదల చేయాలని, ప్రభుత్వ విద్యను బలోపేతం చేసేందుకు అధిక నిధులు కేటాయించాలని పి డి యస్ యూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి కాంపాటి పృథ్వీ, జిల్లా అధ్యక్షురాలు కె.సంద్య కేసీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భద్రాచలం పట్టణంలో బుధవారం పి డి యస్ యూ ఆధ్వర్యంలో వందలాది మంది విద్యార్థులు ప్రభుత్వ డిగ్రీ కాలేజీ నుండి అంబేద్కర్ సెంటర్ మీదుగా ఆర్డీవో కార్యాలయం వరకు భారీ ప్రదర్శన నిర్వహించి కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. ఈ ధర్నా కార్యక్రమానికి పి డి యస్ యూ భద్రాచలం డివిజన్ కార్యదర్శి మునిగల శివ ప్రశాంత్ అధ్యక్షత వహించగా వారు ముఖ్యవక్తులుగా పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో 15 లక్షల మంది విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకున్నారని మూడేళ్లుగా వారికి ఫీజు రీయింబర్స్మెంట్ రాకపోవడంతో విద్యార్థులు చదువులను మధ్యలోనే ఆపి పార్ట్ టైం ఉద్యోగాలు చేసి ఫీజులు చెల్లించాల్సిన దౌర్భాగ్య పరిస్థితిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజులు చెల్లించలేని విద్యార్థులకు ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు సర్టిఫికెట్స్ ఇవ్వకపోవడంతో విద్యార్థులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని తెలిపారు. ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు చేసే ఫీజుల వేధింపులపై కనీసం ప్రభుత్వ అధికారులు నోరు మెదపడం లేదని అన్నారు. ఇప్పటికే ఫీజు బకాయిలు చెల్లించకపోవడంతో రాష్ట్రంలో 300 ఇంజనీరింగ్ కాలేజీలు మూతపడ్డాయని ఇంజనీరింగ్ చదివే విద్యార్థుల భవిష్యత్తు అంధకారమైందని, మొత్తంగా విద్యారంగం అస్తవ్యస్తమైపోయిందని తెలిపారు. తక్షణమే పెండింగ్ స్కాలర్షిప్ సియంబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కెసిఆర్ ప్రభుత్వం ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఒకపక్క ప్రభుత్వ బడలను మూసివేస్తూ ప్రైవేటు పాఠశాలలకు విచ్చలవిడిగా అనుమతులు ఇస్తూ ప్రత్యక్షంగా ప్రోత్సహించడంతో పేద విద్యార్థుల వద్ద ఫీజుల పేరుతో డొనేషన్ల పేరుతో లక్షల రూపాయలని ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఫీజులు వసూలు చేస్తున్నారని తెలిపారు. ఉచిత విద్యకు నమూనాగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ గురుకులాలను ఏర్పాటు చేసి వాటి నిర్వహణను గాలికి వదిలేసారని నేటికీ కొత్త గురుకులాలకు సొంత భవనాలు స్థలాల కేటాయింపు లేకపోవడం బాధాకరమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వసతి గృహాలలో చదివే విద్యార్థులకు కాస్మెటిక్స్, హాస్టల్ నిర్వాహకులకు సంవత్సరాల తరబడి డైట్ బిల్లులు ఇవ్వకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తూ వారి జీవితాలతో చలగాటం ఆడుతుందని అన్నారు. భద్రాచలం కేంద్రంగా గిరిజన యూనివర్సిటీ ప్రభుత్వ నర్సింగ్ కాలేజ్,చర్ల మండలంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీని ఏర్పాటు చేసి గిరిజన విద్యార్థులకు, పేద మధ్యతరగతి విద్యార్థులకు ప్రభుత్వ విద్యను అందుబాటులోకి తెచ్చి విద్యార్థులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం PDSU పట్టణ నాయకులు. పాయం నవీన్, ప్రవీణ్ ,రాంపండు, సుధాకర్ రామకృష్ణ ,చరణ్,ప్రదీప్, దీపిక, తేజశ్రీ, మౌనిక, రమాదేవి ,ప్రమీల, నాగమణి, దేవి ,ప్రసన్న తదితర విద్యార్థులు పాల్గొన్నారు