మత ఉన్మాదాన్ని తెలంగాణ నుండి తరిమికొడదాం
Hanamkondaబిజెపిని బొంద పెడుదామని ప్రగతిశీల శక్తులు, బిజెపి వ్యతిరేక పార్టీలకు సిపిఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు. శుక్రవారం హన్మకొండ జిల్లాకేంద్రంలో జనచైతన్య యాత్ర ‘సందర్భంగా ‘కుడా’ మైదానంలో జిల్లా పార్టీ నాయకత్వంలో బహిరంగసభ జరిగింది. అంతకుముందు ఉదయం కాజీపేట రైల్వే స్టేషన్ వద్ద బైక్ ర్యాలీని తమ్మినేని వీరభద్రం జెండా ఊపి ప్రారంభించారు. ర్యాలీగా ‘కుడా’ మైదానానికి చేరుకున్నారు. బహిరంగసభకు జిల్లా కన్వీనర్ బొట్ల చక్రపాణి అధ్యక్షత వహించారు.
ఈ సభలో వీరభద్రం మాట్లాడుతూ.., పేదలు గుడిసెలు వేసుకున్న స్థలాలకు వెంటనే పట్టాలివ్వాలన్నారు. హన్మకొండ, వరంగల్ నగరాల్లో పోలీసులు మూడుసార్లు గుడిసెలను కూల్చినా మళ్లీ గుడిసెలు వేసుకున్నారని, పేదలపై అక్రమ కేసులు పెట్టారన్నారు. సంపన్నులు ఆక్రమించిన భూములపైకి, అక్రమంగా నిర్మించిన భవనాలపైకి పోలీసులు పోవడం లేదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 22 జిల్లాల్లో లక్ష ఎకరాల్లో పేదలు గుడిసెలు వేసుకున్నారన్నారు. వెంటనే ఆ పేదలందరికీ పట్టాలివ్వాలన్నారు. స్థానిక ఎమ్మెల్యేలతో సంప్రదించామని, ఎమ్మెల్యేలు సహకరిస్తామని చెప్పారన్నారు. గుడిసెవాసులకు పట్టాలిచ్చే విషయంలో సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువచ్చామన్నారు. బిజెపి దేశంలో మనుధర్మాన్ని అమలు చేయాలని ప్రయత్నిస్తుందన్నారు. కులవ్యవస్థను పెంచి పోషించి ఏ కులం వాళ్లు ఆ కులం పనులే చేయాలంటున్నారని, మాదిగలు చెప్పులే కుట్టాలని, మంగలి . క్షౌవరమే చేయాలన్న మనువు రాసిన ధర్మాన్ని అమలు చేయాలని చూస్తున్నారన్నారు. మనం కులం పోవాలనుకుంటుంటే, బిజెపి కులాన్ని బలపరచాలని చూస్తుందన్నారు. బిజెపి మనుష్యుల మధ్య చిచ్చు పెట్టడానికి. తీవ్రంగా ప్రయత్నిస్తుందన్నారు. మనుష్యుల మధ్య చిచ్చు పెట్టే బిజెపిని ఓడించడమే ప్రధాన కర్తవ్యమన్నారు. అదాని కుంభకోణాలపై మాట్లాడని మోదీ
మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా వున్నప్పుడు అదే రాష్ట్రానికి చెందిన ఆదాని చిన్న వ్యాపారవేత్త, మోదీ ప్రధాని అయ్యాక అదాని లక్షల కోట్లకు అధిపతిగా మారాడన్నారు. ఆదాని ఎన్ని కుంభకోణాలు చేశాడో ఇటీవలె బయటపడిందన్నారు. ఈ కుంభకోణాల విషయం పార్లమెంటులో ప్రశ్నిస్తే ప్రధాని మోదీ పెదవి విప్పడం లేదన్నారు. లక్షల కుంభకోణాలు చేసిన ఆదానిపై మాట్లాడని ప్రధాని మోదీ, ప్రతిపక్ష నేతలపై చిన్న తప్పులకు సైతం కేసులు పెడుతున్నాడన్నారు. ఎమ్మెల్సీ కవిత తప్పు చేసినా కేసు పెట్టాల్సిందేనని, మరీ అచానిపై ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు, ప్రతిపక్షాలను అణిచివేయడానికి చిన్న తప్పు దొరికినా, దాన్ని పెద్దగా చూపించి అణిచి వేయడానికి కేసులు పెడుతున్నారన్నారు. ఒకనాడు మోదీ విధానాలను సమర్ధించిన సీఎం కేసీఆర్ ఇప్పుడు బిజెపిని వ్యతిరేకిస్తున్నాడన్నారు. టిఆర్ఎస్ను బిఆర్ఎస్ మార్చి దేశంలో బిజెపిని ఓడించడానికి ప్రచారం చేయనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారని అందుకు మనం బిఆర్ఎస్ ను సమర్ధించాల్సి వుందన్నారు. అలా అని రాష్ట్రంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామిలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.
మోదీ వచ్చిచూడు.. ఇండ్లు లేని పేదలను చూడు..: పోతినేని సుదర్శన్ రావు.. ప్రధాని మోదీ గత ఏడాది ఆగస్టు 15న ఆజాద్ కా అమృతోత్సవ్ కార్యక్రమంలో మాట్లాడుతూ దేశంలో ఇండ్లు లేని వారు ఒక్కరుండరని చెప్పారని, ఇప్పుడు వరంగల్, హన్మకొండ నగరాలకు వచ్చి చూడాలని, ఎంత మంది ఇండ్లు లేని పేదలు ఎంత మంది వున్నారో తెలుస్తుందన్నారు. జీవో 58, 59 ప్రకారం గుడిసెలు వేసుకున్న పేదలందరికీ పట్టాలివ్వాలన్నారు. కొంత మంది కార్పొరేటర్లు పేదలు గుడిసెలు వేసుకుంటుంటే అడ్డుపడుతున్నారన్నారు. ఈ సభాస్థలిని గతంలో ఎవరు ఆక్రమించుకున్నారు ? అలాంటి ఈ ప్రభుత్వ భూమిని సిపిఐ (ఎం) న్యాయపోరాటం చేసి సాధించి ప్రభుత్వానికి అప్పగించిందన్నారు. రెండు పోరాట కేంద్రాల్లో పోలీసు అధికారులే గూండాలను పేదలు వేసుకున్న గుడిసెలపైకి పంపారన్నారు. నిండు గర్భిణి కడుపుపై తన్నారని, ఆ బాధితురాలిని పరామర్శిస్తే ‘నా కడుపుపై తన్నారని, నా కడుపులోని బిడ్డ చచ్చినా, నేను చచ్చినా, ఈ భూమిని మాత్రం పదిలేదు లేదని’ చెప్పిందన్నారు. ఈ భూ పోరాటాన్ని కొందరు అడ్డుకుంటుంటే, కొందరు
సహకరిస్తున్నారని, సహకరిస్తున్న వారికి ధన్యవాదాలన్నారు. మోదీ బినామి అదాని : చెరుపల్లి సీతారాములు
ప్రధాని మోదీ బినామినే అదాని అని సిపిఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు అన్నారు. మోదీ ప్రధాని కాగానే అదాని రూ.19 లక్షల కోట్ల ఆదాయానికి అధిపతిగా మారాడన్నారు. కుంభకోణాలు బహిర్గతం కావడంతో నేడు రూ.7 లక్షల కోట్లకు పడిపోయాడన్నారు. మన సంపద అంతా మోదీ కార్పొరేట్ కంపెనీలకు దోచి పెడుతున్నాడన్నారు. ప్రభుత్వ భూమి అంటే మన భూమని, మనమే గుడిసెలు వేసుకుంటే భూబకాసూరులకు ఆక్రమించుకోవడానికి భూమి వుండదని, ఈ భూపోరాటానికి ఎర్రజెండానే మీకు అండగా వుంటుందని కమ్యూనిస్టు పార్టీల పోరాటం ఫలితంగానే ఎన్నో సంక్షేమ పథకాలను ఈ ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయన్నారు. అలాంటి సంక్షేమ పథకాలను ప్రధాని మోదీ తీసివేస్తామంటున్నాడన్నారు. అలాంటి మోదీని ఓడించాల్సిన అవసరముందన్నారు.పట్టాలిచ్చే వరకు పోరాటం సాగాలి: జూలకంటి రంగారెడ్డి
గుడిసెలు వేసుకున్న స్థలాల్లో పట్టాలిచ్చే వరకు పోరాటం కొనసాగించాలని సిపిఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గసభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలు ఎవరికి ప్రయోజనం కలిగిస్తున్నాయో చెప్పడానికే జనచైతన్య యాత్రను ప్రారంభించామన్నారు. కేంద్రు నిత్యావసర సరుకుల ధరలను గణనీయంగా పెంచి సామాన్యుడు బతకకుండా చేసిందన్నారు. మోదీ ఇచ్చిన హామిలను తుంగలో తొక్కాడన్నారు. రైతాంగ, కార్మిక వర్గ వ్యతిరేక విధానాలను అమలు చేస్తున్నాడన్నారు. ప్రభుత్వరంగ సంస్థలను అమ్మేస్తున్నాడన్నారు. రాష్ట్రంలో ఇండ్లు కావాలని 30 లక్షల మంది పేదలు దరఖాస్తు చేసుకున్నారని, వారందరికీ ఇండ్లను నిర్మించి ఇవ్వాలన్నారు..
భావ ప్రకటన స్వేచ్ఛను హరిస్తున్న కేంద్రం మల్లు లక్ష్మీ
కేంద్ర ప్రభుత్వం భావప్రకటన స్వేచ్ఛను హరిస్తుందని సిపిఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యురాలు మల్లు లక్ష్మీ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ మతోన్మాద చర్యలను వ్యతిరేకిస్తూ మాట్లాడిన కవులు, రచయితలు, కళాకారులు, అభ్యుదయ వాదులపై అక్రమ కేసులు పెట్టి తీవ్రంగా అణిచివేస్తున్నారన్నారు. స్వాతంత్ర్యోద్యమంలో, తెలంగాణ సాయుధ పోరాటంలో ఎలాంటి పాత్ర లేని బిజెపి తెలంగాణపై కాషాయ జెండా ఎగురవేయాలని ప్రయత్నిస్తుందన్నారు. ఈ పోరాట గడ్డపై బిజెపిని గెలవనీయమన్నారు. మంద సంపత్ వందన సమర్పణ చేశారు.
ఈ బహిరంగ సభ లో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు md అబ్బాస్, పాలడుగు భాస్కర్, రాష్ట్ర నాయకులు కోట రమేష్ , హనుమకొండ జిల్లా కమిటీ సభ్యులు సారంపెల్లి వాసుదేవరెడ్డి, జి.ప్రభాకర్ రెడ్డి, యం..చుక్కయ్య, ట్.ఉప్పలయ్య, వాంకుడోతు వీరన్న, రాగుల రమేష్, గొడుగు వెంకట్, జి. రాములు, మంద సంపత్, డి.తిరుపతి, దీప, కాడబోయిన లింగయ్య, మిశ్రీన్ సుల్తానా తదితరులు పాల్గొన్నారు