సర్పంచ్లను గెలిపించుకున్న మొగాన్ని నేను
స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి
అధికారం ఎప్పుడూ శాశ్వతం కాదు-ప్రజలే అసలైన దేవుళ్లు
పదవి చిన్నదైనా సద్వినియోగం చేసుకుంటే అవకాశాలు పెద్దవిగా మారతాయి
15 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి అభివృద్ధిని పట్టించుకోలేదు
కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నందువల్లే రెండు సంవత్సరాల్లో రూ.1400 కోట్ల నిధులు తెచ్చాం
కేటీఆర్ ముఖ్యమంత్రి కావాలనుకోవడం మంచిదే,కానీ మాట్లాడే భాషలో సభ్యత ఉండాలి
నా వయసు కేసీఆర్ కంటే ఎక్కువ-14 ఏళ్లు మంత్రిగా పని చేశాను
నన్ను,పోచారం శ్రీనివాస్ రెడ్డిని ఆడ-మగ అంటూ మాట్లాడడం సిగ్గుచేటు
కేటీఆర్ ఆగమాగమై,మతిస్థిమితం లేక మాట్లాడుతున్నాడు
బీఆర్ఎస్ ఫ్లెక్సీల్లో నా ఫోటో పెట్టడం నాకు సంతోషమే
వాళ్ల బొమ్మ పెట్టుకుంటే ఓట్లు పడటం లేదు కాబట్టే నా ఫోటో వాడుకుంటున్నారు
స్టేషన్ ఘనపూర్లో అన్ని పార్టీలకు ఒక్క మగాడు కడియం శ్రీహరినే
నేను తీసుకున్న ప్రతి రాజకీయ నిర్ణయం నియోజకవర్గ అభివృద్ధి కోసమే స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ రోజురోజుకు బలపడుతోందని మాజీ ఉప ముఖ్యమంత్రి,ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు.పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో నూతనంగా ఎన్నికైన సర్పంచులు,ఉపసర్పంచులు,వార్డు సభ్యులకు నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.నియోజకవర్గంలోని 143 గ్రామ పంచాయతీల్లో 98 పంచాయతీలను కాంగ్రెస్ పార్టీ గెలుచుకుందని,ఇద్దరు రెబల్స్,ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు కూడా త్వరలో కాంగ్రెస్లో చేరనున్నారని తెలిపారు.ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే అత్యధిక గ్రామ పంచాయతీలు గెలిచిన నియోజకవర్గం స్టేషన్ ఘనపూర్ అని పేర్కొన్నారు.దాదాపు 75 శాతం పంచాయతీల్లో విజయం సాధించడమే కాకుండా,సుమారు 1.25 లక్షల ఓట్లు కాంగ్రెస్ మద్దతు అభ్యర్థులకు వచ్చాయని తెలిపారు.నూతనంగా ఎన్నికైన సర్పంచులకు ఇది గొప్ప అవకాశమని,పదవి చిన్నదైనా సద్వినియోగం చేసుకుంటే పెద్ద అవకాశాలు వస్తాయని సూచించారు.అధికారం శాశ్వతం కాదని, ప్రజల మధ్య ఉండి నిజాయితీగా పనిచేసే వారినే ప్రజలు గుర్తుంచుకుంటారని అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో ఉందని,అవసరమైన నిధులు అడిగిన వెంటనే విడుదల చేసే ముఖ్యమంత్రి ఉన్నారని చెప్పారు.సర్పంచులకు ఎమ్మెల్యే,ఎంపీ పూర్తి సహకారం ఉంటుందని భరోసా ఇచ్చారు.గత రెండేళ్లలో గ్రామపంచాయతీ భవనాలు,అంగన్వాడీ కేంద్రాలు సహా అనేక అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు.ఏకగ్రీవంగా ఎన్నికైన గ్రామాలకు అభివృద్ధి నిధులు అందిస్తామని హామీ ఇచ్చారు.ప్రతి గ్రామంలో సీసీ రోడ్ల ప్రారంభోత్సవాలను సర్పంచులే నిర్వహించాలని సూచించారు.అవినీతికి తావులేకుండా పారదర్శకంగా అభివృద్ధి జరగాలని అన్నారు.ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక పేదలకే జరిగేలా సర్పంచులే బాధ్యత వహించాలని తెలిపారు.రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నందువల్లే గత రెండేళ్లలో స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గానికి సుమారు రూ.1400 కోట్ల నిధులు తీసుకురాగలిగామని చెప్పారు.గతంలో 15 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి నియోజకవర్గ అభివృద్ధిని పట్టించుకోలేదని విమర్శించారు.కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందిస్తూ,ముఖ్యమంత్రి కావాలనే లక్ష్యం మంచిదేనని,అయితే ఆ లక్ష్యాన్ని పెట్టుకున్నవారు సభ్యత,సంస్కారం పాటించాలని అన్నారు.రాజకీయాల్లో విమర్శలు ఉండొచ్చు కానీ వ్యక్తిగత దూషణలు సరికాదని వ్యాఖ్యానించారు.ఈ కార్యక్రమంలో వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య,జనగామ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి,జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు,మార్కెట్ కమిటీ చైర్మన్ లావణ్య శిరీష్ రెడ్డి,కాంగ్రెస్ నాయకులు,ప్రజా ప్రతినిధులు,సర్పంచులు,కార్యకర్తలు పాల్గొన్నారు