స్టేషన్ ఘనపూర్ లో కలెక్టర్ రిజ్వాన్ బాషా ఆకస్మిక తనిఖీలు
Jangaon2025 పది ఫలితాల్లో 10/10 జీపీఏ సాధించాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ విద్యార్థులకు సూచించారు.శనివారం జిల్లాలోని ఘనపూర్ (స్టేషన్) నియోజకవర్గం పరిధిలో గల ఆసుపత్రులు,వసతి గృహాలు,పాఠశాలల్లో కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ క్షేత్రస్థాయిలో పర్యటించి,పర్యవేక్షించారు.ఈ క్రమంలో ఘనపూర్ (స్టేషన్) లోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి,పరిశీలించారు.ఈ సందర్భంగా ఆసుపత్రిలో వైద్యుల అటెండెన్స్ రిజిస్టర్లను తనిఖీ చేసి,ఔట్ పేషెంట్,ఇన్ పేషెంట్ లకు సంబంధించిన వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు.ప్రతి రోజూ వైద్యులు,సిబ్బంది రోగులకు అందుబాటులో ఉండాలని,సమయ పాలన పాటించాలని,సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని,డెంగ్యూ,చికెన్ గున్యా,మలేరియా,టైఫాయిడ్ వంటి విష జ్వరాలు విజృంభిస్తున్న నేపథ్యంలో రోగులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.రోగులకు అందించే ఆహారం గురించి ఆరా తీయగా,నాణ్యమైన,శుచికరమైన భోజనాన్ని ఇవ్వాలని సూచించారు.అలాగే ఆసుపత్రిలో జ్వరంతో బాధపడుతూ చికిత్స కోసం వచ్చిన రోగులతో కలెక్టర్ మాట్లాడారు.జ్వరం ఎప్పటినుంచి వస్తుంది? ఇప్పుడు ఎలా ఉందని వారిని అడిగి తెలుసుకున్నారు.అదే విధంగా వ్యక్తిగత పరిశుభ్రత కచ్చితంగా పాటించాలని,స్వచ్ఛమైన కాచిన నీటిని తాగాలని,వేడి ఆహారం తీసుకోవాలని రోగులకు సూచించారు.అనంతరం కేజీబీవీ వసతి గృహాన్ని,ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలను,ఎస్సీ వసతి గృహాలను సందర్శించి పర్యవేక్షించారు.ఈ సందర్భంగా వంటశాలలోని బియ్యం,పప్పు,గుడ్లు,తదితర వంట సరకుల నాణ్యతను పరిశీలించి,వంటగదిలో,పరిసరాల్లో పరిశుభ్రత చర్యలు చేపట్టాలని,పురుగు పట్టిన,ఎక్కువ కాలం నిల్వ ఉంచిన ఆహార ఉత్పత్తులను ఉపయోగించకూడదని సిబ్బందిని ఆదేశించారు.అలాగే మరుగుదొడ్లు,మూత్రశాలలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని,విద్యార్థులకు అందించే ఆహారాన్ని పరిశీలించి,శుచిరుచికరమైన మంచి భోజనాన్ని అందించాలని సూచించారు.అదే విధంగా 9,10వ తరగతి విద్యార్థులతో మాట్లాడి వారి అభ్యసన సామర్థ్యాలను పరీక్షించారు.2025 పది ఫలితాల్లో 10/10 జీపీఏ సాధించాలని విద్యార్థులకు సూచించారు.అందుకు తగ్గట్లుగా ఉపాధ్యాయులు చెప్పే బోధన పాఠాలను శ్రద్ధగా విని నేర్చుకోవాలని,మంచి ఫలితాలు సాధించే దిశగా సన్నద్ధత కావాలని సూచించారు.జీవితంలో ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని తెలిపారు.అనంతరం మోతె ప్రైవేట్ వైద్యశాలలో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆసుపత్రిలోని వైద్యులు,సిబ్బంది డీఆర్ఏ(డిస్ట్రిక్ట్ రిజిస్ట్రేషన్ యాక్ట్) ప్రకారం నియమ నిబంధనలు కచ్చితంగా పాటించాలని,ప్రతిరోజూ అందుబాటులో ఉండే వైద్యుల పేర్లను బోర్డుపై ప్రదర్శించాలని,అలాగే టెస్టుల పేరుతో ఆసుపత్రికి వచ్చే రోగుల నుంచి అడ్డగోలుగా పైసలు వసూలు చేయరాదని,అలా చేస్తే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.అదే విధంగా ప్రజలకు తెలిసే విధంగా ఆసుపత్రిలో అందించే వివిధ వైద్య సేవల వివరాలను,క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కింద టెస్టుల ఛార్జీల వివరాలను బోర్డుపై ప్రదర్శించాలని ఆదేశించారు.వైద్యులు ప్రతిరోజూ రోగులకు అందుబాటులో ఉండాలని తెలిపారు. ఈ పర్యవేక్షణలో కలెక్టర్ వెంట ఆర్డీఓ వెంకన్న,ఇంఛార్జి డీఎంహెచ్ఓ రవీందర్ గౌడ్,తహసీల్దార్ వెంకటేశ్వర్లు,ఎంపిడిఓ మధుసూదన చారి,ఇతర సంబంధిత అధికారులు,సిబ్బంది,వైద్యులు,నర్సులు,తదితరులు పాల్గొన్నారు.