అందులు, పాక్షికదృష్టి లోపం కలిగిన వారి హక్కుల సాధన కోసం ఉద్యమం
Jangaon. 04-01-2023**.****బ్రెయిలీ లిపిని విస్తృత పరచాలి.****ఘనంగా లూయిస్ బ్రెయిలీ 214వ జయంతి.**—————————–(ఎన్‌పిఆర్‌డీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బిట్ల గణేష్)అందులు, పాక్షిక దృష్టి లోపం కలిగినవారి హక్కుల పరిరక్షణ కోసం ఉద్యమాలు చేస్తామని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్‌పిఆర్‌డీ) రాష్ట్ర ఉపాధ్యక్షులు బిట్ల గణేష్ హెచ్చరించారు. దివి: 04-01-2023 బుధవారం రోజున జనగామ పట్టణంలోని జిల్లా ప్రజాసంఘాల జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు పాముకుంట్ల చందు ఆధ్వర్యంలో అంతర్జాతీయ బ్రెయిలీ దినోత్సవాన్ని పురస్కరించుకొని లూయిస్ బ్రెయిలీ 214వ జయంతిని జరుపుకోవడం జరిగింది. ఈ సందర్బంగా లూయిస్ బ్రెయిలీ చిత్రపటానికి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బిట్ల గణేష్ పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన సభలో రాష్ట్ర ఉపాధ్యక్షులు బిట్ల గణేష్ మాట్లాడుతూ బ్రెయిలీ లిపి ఆరు చుక్కలను ఉపయోగించి అక్షరాలు మరియు అంకెలను స్పర్శ ద్వారా తెలుసుకోవడానికి దోహదం చేస్తుందన్నారు. శాస్త్ర, సాంకేతిక రంగంలో సైతం బ్రెయిలీ లిపి అందుబాటులో ఉండడం ద్వారా అనేకమంది అంధులు ఉన్నత విద్యావంతులు అవుతున్నారని తెలిపారు. దృష్టి లోపం ఉన్న వారు సమాజంలో అన్ని రంగాల్లో నిలదొక్కుకునేందుకు అందరికీ సమాన అవకాశాలు పొందేందుకు, విద్య, ఉపాధి, బావవ్యక్తీకరణ స్వేచ్ఛ, చదువుకోవడానికి బ్రెయిలీ లిపి ఉపయోగపడుతుద న్నారు. లూయిస్ బ్రెయిలీ 1809 జనవరి 4న పారిస్ దగ్గరలోని కృవే అనే గ్రామంలో జన్మించినారని అన్నారు. లూయిస్ బ్రెయిలీ ఫ్రెంచ్ విద్యావేత్త అని తెలిపారు. బ్రెయిలీ తల్లిదండ్రులు గుఱ్ఱపు జీనుల తయారు పరిశ్రమలో పనిచేసేవారని, బ్రెయిలీ తన తండ్రి వర్క్‌షాప్‌లో తోలుతో పని చేయడాన్ని చూసి అతన్ని అనుసరిస్తూ ఒకరోజు తన తండ్రి మాదిరిగా తోలుకు రంధ్రాలు చేయడానికి ప్రయత్నిస్తే ప్రమాదవశాత్తు అతని కంటికి ఇనుప మేకు తగిలి గాయమైందన్నారు. కంటికి తగిలిన గాయం నుండి బయటపడేందుకు బ్రెయిలీ తల్లిదండ్రులు చేసిన ప్రయత్నాలన్నీ సఫలం కాలేదన్నారు. చివరకు రెండో కంటి చూపు కూడా కోల్పోయాడని అన్నారు. కంటిచూపు కోల్పోయినప్పటికీ అతని తల్లిదండ్రులు అతనికి విద్యను అందించేందుకు నిరంతరం ప్రయత్నించారు. పారిస్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది బ్లైండ్ లో చేరి విప్లవాత్మకమైన బ్రెయిలీ లిపిని కనిపెట్టినాడని తెలిపారు. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 2018 సంవత్సరంలో జనవరి 4ను అంతర్జాతీయ బ్రెయిలీ దినోత్సవంగా జరపాలని నిర్ణయించిందని, 2019 నుండి ప్రపంచవ్యాప్తంగా లూయిస్ బ్రెయిలీ జన్మదినాన్ని అంతర్జాతీయ బ్రెయిలీ దినోత్సవంగా జరుపుకుంటున్నామని అన్నారు. కమ్యూనికేషన్ సాధనంగా బ్రెయిలీ లిపి ప్రాముఖ్యతపై అవగాహన పెంచడం, అందులకు మరియు పాక్షిక దృష్టిలోపం గల వ్యక్తులు సమాన హక్కులు పొందే విధంగా చర్యలు చేపట్టాలని ఐక్యరాజ్యసమితి నిర్ణయించిందని తెలిపారు. విద్య, వైద్య, ఆరోగ్య రంగాలకు సంబంధించిన సమాచారాన్ని బ్రెయిలీ లిపిలో విస్తృత పరచాల్సిన అవసరం ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతైనా ఉందని అన్నారు. అందులు వినియోగించుకునే విధంగా సామూహిక ప్రాంతాలన్నీ అవరోధ రహితంగా మార్చడంలో నిర్దేశించిన లక్ష్యాన్ని చేరడంలో ప్రభుత్వాలు విఫలం చెందినాయని విమర్శించారు. బ్రెయిలీ లిపిని విస్తృత పరచి అంధుల మరియు పాక్షిక దృష్టిలోపం కలిగిన వారిని అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకోవాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దేశవ్యాప్తంగా అందుల నైపుణ్య అభివృద్ధి కోసం ఉన్నటువంటి (ఎన్.ఐ.వి.ఎచ్) నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రద్దు చేయడానికి ప్రయత్నిస్తున్నాయని అన్నారు. విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు సక్రమంగా అమలు చేయకపోవడం ద్వారా తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు.అందులు మరియు పాక్షిక దృష్టిలోపం కలిగిన విద్యార్థుల కోసం ల్యాప్‌టాప్‌లు ఉచితంగా అందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠ్యపుస్తకాలు బ్రెయిలీ లిపిలో అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు. 2016 వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం స్ఫూర్తికి భిన్నంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 100 శాతం వైద్యుల ద్రువీకరణ పత్రం (సదరం సర్టిఫికెట్) ఉంటేనే సంక్షేమ పథకాలు అమలు చేస్తామని ప్రకటించి అంధులకు అన్యాయం చేస్తుందని విమర్చించారు. అంతర్జాతీయ బ్రెయిలీ దినోత్సవం స్ఫూర్తితో అందులు మరియు పాక్షిక దృష్టి లోపం కలిగినవారి హక్కులకోసం ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మాలోతు రాజ్ కుమార్, పట్టణ నాయకులు రావుల శ్రీనివాస్, సత్తయ్య, ఎం.డి.అన్వర్, వీరాస్వామి తదితరులు పాల్గొన్నారు.