కేంద్ర బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను ప్రతిఘటిద్దాం.
Jangaonప్రజల మధ్య విద్వేషాలతో రాజకీయ లబ్ది.*
ప్రజలకు చైతన్యం కల్పించాల్సిన ఆవశ్యకత కమ్యూనిస్టులపై ఉంది.
సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎం.డి అబ్బాస్.)
దేశంలో చాతుర్వర్ణ వ్యవస్థను తీసుకొచ్చి దేశాన్ని పురోగమనం వైపు నడిపే లక్ష్యంతో బీజేపీ మోడీ ప్రభుత్వం ముందుకెళ్తున్నదని, కమ్యూనిస్టులుగా ప్రజలకు చైతన్యం కల్పించాల్సిన ఆవశ్యకత మనందరిపై ఉందని సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎం.డి అబ్బాస్ పిలుపునిచ్చారు.
దివి: 11-01-2023 బుధవారం రోజున జనగామ పట్టణ కేంద్రంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో సిపియం పార్టీ జనగామ జిల్లా కమిటీ సమావేశం పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బోట్ల శేఖర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశానికి పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎం.డి అబ్బాస్ ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడుతూ దేశంలోని బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రజా, కార్మిక, రైతుల సమస్యలను గాలికొదిలేసి ప్రజల మధ్య విద్వేషాలను, మత, కుల ఘర్షణలను రెచ్చగొడుతూ రాజకీయ లబ్ది పొందుతున్నదన్నారు. రాజ్యాంగం స్థానంలో మనుస్మృతిని తీసుకురావాలనే ఎత్తుగడతో ముందుకు సాగుతున్న తీరును వివరించారు. దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ పాగా వేసేందుకు శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నదని అన్నారు. దీన్ని ప్రజాస్వామిక వాదులందరూ తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ప్రజలందరికీ మేలు జరిగే సమసమాజం రావాలని, కమ్యూనిస్టులు పోరాడుతుంటే…
బీజేపీ మాత్రం ప్రజలను కుల, మత విభేదాలతో దేశాన్ని చీల్చి తిరోగమనం వైపు నడిపే చాతుర్వర్ణ వ్యవస్థను అమలు చేయడం కోసం పనిచేస్తున్న తీరును తప్పుబట్టారు. గతంలోనే భారత రాజ్యాంగం చెత్త అని గోల్వాల్కర్ అనగా, మనుస్మృతి ఉండగా రాజ్యాంగం గురించి చర్చే అవసరం లేదని జనసంఘ్ పరివార్ చెప్పిన విషయాలను ప్రస్తావించారు. ఇప్పుడు వారే రాజ్యాంగంపై కపట ప్రేమను చూపుతున్నారని విమర్శించారు. రోజువారీగా ప్రజలు చేసే ప్రతిపనిలోనూ, రాజకీయాల్లోనూ బీజేపీ తన విద్వేషాలతో కూడిన భావజాలాన్ని ఎక్కిస్తున్న తీరును విమర్శించారు. చివరకు చిన్నపిల్లల మెదళ్లల్లోనూ విషభావజాలాన్ని ఎక్కిస్తున్న తీరుపట్ల ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యాంగంపై నేరుగా కాకుండా ఒక్కో వ్యవస్థను నిర్వీర్యం చేసుకుంటూ మోడీ సర్కారు ముందుకెళ్తున్నదని విమర్శించారు. పార్లమెంట్లో అసమర్ధ పాలన అంటేనే తట్టుకోలేని పరిస్థితిలో బీజేపీ ఉందన్నారు. రాష్ట్రాల హక్కులను మోడీ సర్కారు హరిస్తున్నదని చెప్పారు. దేశంలో లౌకిక విలువలు, ఆర్థిక స్వాలంబన, సామాజిక న్యాయం, ఫెడరల్ వ్యవస్థలపై దాడి తీవ్రమైందనీ, వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని అన్నారు. బిజెపిని కట్టడి చేయకపోతే దేశంలో ప్రశ్నించే గళాలలను మరింత అణచివేసే అవకాశముంటుందని హెచ్చరించారు. ప్రజ లకు చైతన్యం కల్పించాల్సిన బాధ్యత అందరికంటే ఎక్కువగా కమ్యూనిస్టులపైనే ఉందని నొక్కి చెప్పారు. దేశాన్ని రక్షించుకునేందుకు బీజేపీని పాతరేయాలన్నారు. దేశంలో ప్రత్యామ్నాయ విధానాలు అమలు చేయాల్సిన అవసర ముందనీ, ఆ దిశగా కేరళ ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని తెలిపారు. బీజేపీ వ్యతిరేక శక్తులన్నీ ఏకం కావాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. ఈ కార్యక్రమంలో సిపిఐ(ఎం) జనగామ జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు రాపర్తి రాజు, జిల్లా కమిటీ సభ్యులు బూడిది గోపి, పోత్కనూరి ఉపేందర్, జోగు ప్రకాష్, పొదల నాగరాజు, సుంచు విజేందర్, చిట్యాల సోమయ్య, భూక్యా చందు నాయక్, కోడెపాక యాకయ్య, మండల కార్యదర్శులు గంగాపురం మహేందర్, బొడ్డు కర్ణాకర్, సాదం రమేష్, ఆఫీసు కార్యదర్శి బిట్ల గణేష్ తదితరులు పాల్గొన్నారు.