సఫాయి కార్మికుల సేవలు మరువలేనివి
జనగామ పట్టణంలోని రెండవ వార్డు పరిధిలోని కెమిస్ట్రీ భవన్–నెల్లుట్ల శ్రీనివాస కాలనీ సరిహద్దు ప్రాంతంలో నాలుగు రోజుల క్రితం చనిపోయిన ఒక వరాహం (పంది), ఒక శునకం (కుక్క) కుళ్లిపోవడంతో తీవ్ర దుర్గంధం వెదజల్లుతూ స్థానిక ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేశాయి.పురుగులు పడి కాలేబరాలు పగిలిపోవడంతో ఆ ప్రాంతంలో నివసించే ప్రజలు ఆరోగ్య సమస్యల పట్ల ఆందోళన వ్యక్తం చేశారు.ఈ విషయాన్ని స్థానిక పెద్ద ఫకీర్ యాదగిరి రెడ్డి, మూడవ వార్డు కౌన్సిలర్ బూడిద జ్యోతి గోపి దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం మున్సిపల్ ఇన్స్పెక్టర్ గోపయ్య, రెండవ వార్డు ఏరియా జవాన్ రాజులకు సమాచారం అందించారు.సమాచారం అందిన వెంటనే స్పందించిన మున్సిపల్ అధికారులు కేవలం అరగంటలోనే సఫాయి కార్మికులను సంఘటన స్థలానికి పంపించారు. భరించలేని దుర్వాసన, పురుగులతో నిండిన పరిస్థితుల్లోనూ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని సఫాయి కార్మికులు చనిపోయిన జంతువుల కాలేబరాలను తొలగించి పరిసర ప్రాంతాన్ని పరిశుభ్రం చేశారు.ఈ సందర్భంగా స్థానిక ప్రజలు మున్సిపల్ సఫాయి కార్మికుల సేవలను ప్రశంసిస్తూ వారికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజారోగ్య పరిరక్షణ కోసం ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా తమ విధులను నిర్వర్తిస్తున్న సఫాయి కార్మికుల త్యాగం, సేవాస్ఫూర్తి సమాజానికి ఆదర్శమని కొనియాడారు.“సఫాయి కార్మికుల సేవలను గుర్తిద్దాం…వారిని గౌరవిద్దాం…” అని స్థానికులు పిలుపునిచ్చారు