ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలి
ఆత్మకూరు మండల హౌజ్ బుజుర్గు గ్రామంలోని ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని స్థానిక గ్రామ సర్పంచ్ సయ్యద్ మౌలా ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్రంలో జరుగుతున్న ధాన్యం సేకరణ ప్రక్రియను, రైతులకు కల్పిస్తున్న వసతులను ఆయన అడిగి తెలుసుకున్నారు.
అనంతరం సర్పంచ్ సయ్యద్ మౌలా మాట్లాడుతూ… రైతులు పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, అయితే వర్షాల ముప్పు పొంచి ఉన్నందున అధికారులు, నిర్వాహకులు కొనుగోలు ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని కోరారు. రాబోయే జూన్ 4వ తేదీ నాటికి గ్రామంలోని ధాన్యం కొనుగోళ్లన్నింటినీ పూర్తి చేయాలని ఆయన అధికారులకు, ఐకేపీ సిబ్బందికి సూచించారు.
రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, తూకాల్లో తేడాలు లేకుండా పారదర్శకంగా కొనుగోళ్లు జరపాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఐకేపీ ఇంచార్జి షరీఫ్ గ్రామ డీలర్ ఇంచార్జి కరీం మరియు స్థానిక నాయకులు మరియు రైతులు పాల్గొన్నారు.