బాలికలు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలి
Hanamkondaహనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య
ఈ69 న్యూస్ హనుమకొండ
బాలికలు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య అన్నారు.శుక్రవారం వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాల ఆవరణలోని హనుమకొండ జిల్లా ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ ప్రావీణ్య,కేఎంసీ ప్రిన్సిపల్ డాక్టర్ రాంకుమార్ రెడ్డి,నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్ సునీతలతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు.అనంతరం ఫ్లోరెన్స్ నైటింగెల్ చిత్రపటానికి కలెక్టర్ ప్రావీణ్య,డాక్టర్ రాంకుమార్ రెడ్డి,సునీత పూలమాల వేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ..అమ్మాయిలు పట్టుదలతో ఎంచుకున్న లక్ష్యాన్ని సాధించాలన్నారు.బాలికలు ఆత్మస్థైర్యంతో జీవితంలో ముందుకు సాగాలన్నారు.విద్యార్థినుల చదువులు,ఉద్యోగాల్లోనూ ముందు నిలవాలన్నారు.తల్లిదండ్రుల ప్రోత్సాహంతో తాను ఢిల్లీకి వెళ్లి సివిల్స్ కోచింగ్ తీసుకున్నట్లు పేర్కొన్నారు.ఉన్నత సేవలు అందించే వృత్తులలో నర్సింగ్ ఒకటని,క్లిష్ట పరిస్థితుల్లోనూ సేవలందించడంలో నర్సుల సేవలు ఎంతో ప్రాముఖ్యమైన వని అన్నారు.మహిళా దినోత్సవం నేపథ్యంలో
కళాశాల విద్యార్థినులు
అద్భుతంగా నృత్యాలు చేశారని,మహిళా దినోత్సవ ఏర్పాట్లు చాలా బాగున్నాయని అన్నారు.కేఎంసి ప్రిన్సిపల్ డాక్టర్ రాంకుమార్ రెడ్డి మాట్లాడుతూ మహిళలు శక్తిమంతులు,ధైర్యవంతులు అని అన్నారు.మహిళలు ఎంతోమంది ప్రపంచ వ్యాప్తంగా భిన్న రంగాల్లో రాణిస్తున్నారని అన్నారు.పురుషులతో సమానంగా మహిళలు వివిధ రంగాల్లో తమ ప్రతిభను చాటుతున్నారని పేర్కొన్నారు.స్త్రీ,పురుషులు ఇద్దరూ సమానమేనని అన్నారు.నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్ సునీత మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో మహిళలు వివిధ రంగాలలో రాణిస్తూ ప్రథమ స్థానంలో నిలుస్తున్నారని అన్నారు.విద్యార్థినులు ఉన్నత స్థానం సాధించాలని ఆకాంక్షించారు.మహిళా దినోత్సవ నేపథ్యంలో కళాశాల విద్యార్థినులు స్పందిస్తూ తమ తల్లినే స్ఫూర్తి అని పేర్కొన్నారు.తాము జీవితంలో లక్ష్యం చేరేందుకు తల్లి ప్రోత్సాహంతో ముందుకు సాగేలా స్ఫూర్తినిస్తుందన్నారు.ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను శాలువా,జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు.మహిళా దినోత్సవం నేపథ్యంలో నర్సింగ్ కళాశాల విద్యార్థినులు మహిళల గొప్పదనం తెలియజేస్తూ ప్రదర్శించిన నృత్యాలు కేరింతలు పెట్టించాయి.నర్సింగ్ కళాశాల అధ్యాపకులు,సిబ్బంది,విద్యార్థినులు పాల్గొన్నారు.