విభిన్న రంగాల్లో రాణిస్తున్న మహిళలు
Hanamkondaసమస్యలు ఎదురైనప్పుడు మహిళలు ధైర్యంగా పోరాడాలి
వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి వి.బి.నిర్మల గీతాంబ
ఈ69 న్యూస్ హనుమకొండ
ముందు తరాలతో పోల్చుకుంటే ప్రస్తుత తరంలో మహిళలు విభిన్న రంగాల్లో ముందు వరుసలో నిలుస్తున్నారని వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి వి.బి.నిర్మల గీతాంబ అన్నారు.శుక్రవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్ లో తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ హనుమకొండ,వరంగల్ జిల్లా శాఖల ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి వి.బి.నిర్మల గీతాంబ మాట్లాడుతూ..ప్రస్తుత సమాజంలో మహిళలు వెనుకబడి లేరని,అన్ని రంగాల్లో ముందు నిలుస్తున్నారని అన్నారు.ముందు తరాలతో పోల్చుకుంటే విభిన్న రంగాల్లో ముందున్నామన్నారు.కలెక్టర్లు,పోలీస్,తదితర ఎన్నో ఉద్యోగాలు మొదలుకొని ఆకాశం వరకు మహిళలు ఎన్నో అవకాశాలను సద్వినియోగం చేసుకొని ముందు నిలుస్తున్నారని పేర్కొన్నారు.మహిళలు ఎందులోనూ తీసుపోలేరని,ఉద్యోగాలు,బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని,అందుకు కలెక్టర్లు,తదితర ఎంతోమంది ఉద్యోగులే నిదర్శనం అని అన్నారు.ఒకరికొకరు గౌరవించుకున్నప్పుడే సమాజం ఎంతో ముందుకు వెళ్తుందన్నారు.సమస్యలు ఎదురైనప్పుడు మహిళలు ధైర్యంగా పోరాడాలన్నారు.మహిళలు జీవిత మార్గంలో లక్ష్యాన్ని కష్టపడి సాధించాలన్నారు.మనం కష్టపడి సాధించిన ప్రగతి ప్రస్థానాన్ని నెమరు వేసుకున్నప్పుడు ఎంతో సంతోషంవేస్తుందన్నారు.విభిన్న రంగాలలో రాణిస్తున్న మహిళలు మరెంతో మంది మహిళలకు ఆదర్శంగా నిలవాలన్నారు.ఎన్నో అవరోధాలను దాటి ఉన్నత స్థానంలో నిలిచినందుకు మహిళా అధికారులు ఉద్యోగులకు అభినందనలు తెలిపారు.హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య మాట్లాడుతూ..ప్రభుత్వ ఉద్యోగంలో విధులు నిర్వర్తిస్తున్న ప్రతి మహిళా ఒక రోల్ మోడల్ అని పేర్కొన్నారు.సమాజంలో పురుషులే మహిళా దినోత్సవం నిర్వహించినప్పుడే అసలైన మహిళా దినోత్సవం అని పేర్కొన్నారు.మహిళా ఉద్యోగులను ప్రోత్సహించినప్పుడు మరింత సమర్థవంతంగా విధులు నిర్వర్తిస్తారని అన్నారు.భావితరాలకు స్ఫూర్తిదాయకంగా నిలవాలన్నారు.తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్పోర్ట్స్,కల్చరల్ పోటీలలో మహిళా ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొన్నారని అన్నారు.ఈ సందర్భంగా మహిళా అధికారులు,ఉద్యోగులకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ..సమాజంలో,కుటుంబ వ్యవస్థలో మహిళలే కీలకమని అన్నారు.పురుషులతో సమానంగా మహిళలు రాణిస్తున్నారని అన్నారు.సమాజంలో స్త్రీల పట్ల వివక్షను రూపుమాపే విధంగా కృషి చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.అన్ని రంగాలలో మహిళలను ప్రోత్సహించాలన్నారు.టీఎన్జీవో రాష్ట్ర ఉపాధ్యక్షుడు జగన్ మోహన్ రావు మాట్లాడుతూ.. తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హనుమకొండ వరంగల్ జిల్లాల మహిళా ఉద్యోగులకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం నేపథ్యంలో వివిధ కార్యక్రమాలను నిర్వహించినట్లు తెలిపారు.వివిధ పోటీలలో మహిళా ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొన్నారని పేర్కొన్నారు.వివిధ బాధ్యతలలో ఎంతో ఒత్తిడి ఉండే మహిళా ఉద్యోగులు ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా మరింత ఉత్సాహాన్ని కలగజేస్తాయన్నారు.తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్లో కీలక బాధ్యతల్లో మహిళలకు పెద్దపీట వేస్తున్నట్లు తెలిపారు.ముఖ్యఅతిథిగా పాల్గొన్న వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి వి.బి.నిర్మల గీతాంబ,జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ను శాలువాలు జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా మహిళా ఉద్యోగులు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు.తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలుగా నిలిచిన మహిళా ఉద్యోగులకు జిల్లా కలెక్టర్ ప్రావీణ్య చేతుల మీదుగా ప్రశంస పత్రాలు,జ్ఞాపికలను అందజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి మేన శ్రీను,జిల్లా ఖజానా శాఖ అధికారి శ్రీనివాస్ కుమార్,మహిళా అధికారులు నీరజ,అనురాధ,తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రతినిధులు,తదితరులు పాల్గొన్నారు.