ఉపాధి కూలీల హక్కులను కాలరాస్తున్న కేంద్రం
గ్రామీణ ఉపాధి కూలీల కోసం అనేక పోరాటాల ద్వారా యూపీఏ-1 ప్రభుత్వ హయాంలో సాధించుకున్న మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం నుంచి గాంధీ పేరును తొలగించడం దుర్మార్గమని సీపీఎం అయినవోలు మండల కార్యదర్శి కాడబోయిన లింగయ్య కేంద్ర బీజేపీ ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు.మహాత్మ గాంధీ ఉపాధి హామీ చట్టం నుంచి గాంధీ పేరును తొలగించడాన్ని నిరసిస్తూ సోమవారం మండల కేంద్రంలో జీవో కాపీలను దగ్ధం చేశారు.అనంతరం ఒంటిమామిడిపల్లిలోని గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా కాడబోయిన లింగయ్య మాట్లాడుతూ,..కమ్యూనిస్టుల నిరంతర పోరాటాల ఫలితంగా తీసుకొచ్చిన మహాత్మ గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని బీజేపీ ప్రభుత్వం నీరుగార్చే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు.ఇప్పుడు తీసుకొచ్చిన భారత్ రోజ్ ఆజీవికా మిషన్ (గ్రామీణ) బిల్లు-2025 (వీబీజీ రామ్ జీ బిల్లు) ద్వారా ఉపాధి హామీ చట్టాన్ని ఒక పథకంగా మార్చి,కూలీల హక్కులను హరించేందుకు ప్రయత్నిస్తోందన్నారు.శ్రీరాముని పేరుతో ప్రజలను మోసం చేస్తూ,కూలీల కడుపు కొట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం స్థానంలో ‘వీబీజీ రామ్ జీ బిల్లు’ తీసుకురావడం ద్వారా ఉపాధి కూలీల పట్ల కేంద్రం నిర్లక్ష్య వైఖరిని స్పష్టంగా చూపుతోందన్నారు.గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యథాతథంగా కొనసాగించాలని,నిధులను పెంచడంతో పాటు కూలీల వేతనాలు పెంచి,పని దినాలను 200 రోజులకు పెంచాలని డిమాండ్ చేశారు.చట్టం వైఫల్యం చెందాలనే ఉద్దేశంతోనే దాన్ని పథకంగా మార్చారని ఆరోపించారు.భారత స్వాతంత్ర్య ఉద్యమంలో బీజేపీ,ఆర్ఎస్ఎస్ పాత్ర లేకపోవడంతోనే స్వాతంత్ర్య పోరాట యోధుల పేర్లను,గాంధీజీ పేరును తొలగించే కుట్ర చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఉపాధి హామీ పనిదినాలు,వేతనాలు పెంచాలని ఎన్నిసార్లు కోరినా కేంద్రం పట్టించుకోలేదన్నారు.ఇంతకు ముందు ఉన్న 90 శాతం కేంద్ర వాటాను తగ్గించి,కొత్త బిల్లులో రాష్ట్రాలపై 40 శాతం భారం మోపడం ప్రజావ్యతిరేక చర్య అని విమర్శించారు.కేంద్రం విడుదల చేసిన నిధులకంటే అధికంగా అయ్యే ఖర్చును రాష్ట్రాలే భరించాలనే నిబంధన అన్యాయమన్నారు.ఉపాధి హామీ చట్టంలో ఉన్న నిరుద్యోగ భృతిని తొలగించడంతో పాటు,కూలీల సంఖ్యను కూడా తగ్గించారని ఆరోపించారు.2047 నాటికి దేశాన్ని పూర్తిగా హిందూ దేశంగా మార్చాలనే లక్ష్యంతో బీజేపీ-ఆర్ఎస్ఎస్ దేశ పునాదులపై దాడులు చేస్తున్నాయని విమర్శించారు.ప్రజా పోరాటాల ద్వారా సాధించుకున్న కార్మిక,విద్య,ఉపాధి హక్కులను తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలకు పాల్పడుతోందన్నారు.పెండింగ్లో ఉన్న ఉపాధి హామీ బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కమిటీ సభ్యులు గుండెకారి మహేందర్,కొంకాల నారాయణరెడ్డి,మడిగి నాగరాజు,మండల నాయకులు కొంకాల కవిత,లెంకల నరసయ్య తదితరులు పాల్గొన్నారు.