అర్హులైన ప్రతి దివ్యాంగుడికి ప్రజా ప్రభుత్వం అండగా
దివ్యాంగులకు ఎలక్ట్రికల్ స్కూటీలు, విద్యార్థులకు ల్యాప్టాప్ల పంపిణీ
యాదవ కాలనీలో నూతన విద్యుత్ లైన్ల ప్రారంభం సమాజంలోని అట్టడుగు వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని,అర్హులైన ప్రతి ఒక్క దివ్యాంగుడికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు స్పష్టం చేశారు.మంగళవారం భూపాలపల్లి మంజూరునగర్లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భూపాలపల్లి నియోజకవర్గానికి చెందిన అర్హులైన దివ్యాంగులకు ఎలక్ట్రికల్ స్కూటీలు,విద్యార్థులకు ల్యాప్టాప్లను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు స్వయంగా అందజేశారు.ఈ సందర్భంగా లబ్ధిదారులతో ఆయన మాట్లాడి వారి సమస్యలు, అవసరాలను తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు సమాజంలోని ప్రతి వర్గానికి చేరాలనే సంకల్పంతో ముందుకు సాగుతోందని తెలిపారు. ముఖ్యంగా దివ్యాంగుల సంక్షేమం పట్ల ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని పేర్కొన్నారు.అర్హులైన ప్రతి దివ్యాంగుడికి ప్రభుత్వ పథకాలు, పింఛన్లు, వైద్య సదుపాయాలు, ఉపాధి అవకాశాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.దివ్యాంగులు స్వావలంబనతో, గౌరవప్రదమైన జీవితం గడపేందుకు అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు. విద్యార్థులు చదువులో రాణించేందుకు ల్యాప్టాప్లు ఎంతో ఉపయోగపడతాయని, అలాగే దివ్యాంగులు స్వతంత్రంగా ప్రయాణించేందుకు ఎలక్ట్రికల్ స్కూటీలు తోడ్పడతాయని అన్నారు.దివ్యాంగుల సమస్యలను స్థానిక స్థాయిలోనే పరిష్కరించేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు.అర్హత ఉన్న ఒక్కరికీ కూడా అన్యాయం జరగకుండా ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరిస్తుందని భరోసా ఇచ్చారు.ప్రజల సంక్షేమం కోసం ఎల్లప్పుడూ తన కార్యాలయం అందుబాటులో ఉంటుందని తెలిపారు.అనంతరం భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని యాదవ కాలనీ 5వ వార్డులో కొత్తగా ఏర్పాటు చేసిన విద్యుత్ లైన్లను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రజలకు కనీస మౌలిక వసతులు అందించడం ప్రభుత్వ ప్రాధాన్యత అని తెలిపారు. విద్యుత్ సరఫరా మెరుగుపడటంతో స్థానికులకు దీర్ఘకాలిక ఉపశమనం కలుగుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, దివ్యాంగులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.