
వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ అధికారులు
ఈ69న్యూస్ స్టేషన్ ఘన్పూర్
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సి.సుదర్శన్ రెడ్డి జూలై 30న ఓటరు జాబితా తాజాపరచట కార్యక్రమం సంబంధించి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల సిబ్బందికి పలు కీలక సూచనలు చేశారు.శాసనసభ నియోజకవర్గాల పరిధిలో ఓటరు జాబితా సవరణలలో భాగంగా ఇంటింటి సర్వే చేపట్టనున్నట్టు తెలిపారు.ఈ సర్వేలో బూత్ స్థాయి అధికారుల నుండి ఎన్నికల రిజిస్టరింగ్ అధికారుల వరకు ప్రతి ఒక్కరూ సక్రియ పాత్ర పోషించాలని ఆదేశించారు.సర్వే సిబ్బంది ఇంటింటికి వెళ్లినపుడు ఓటర్ల వివరాలను జాగ్రత్తగా పరిశీలించి,అవసరమైతే సరిదిద్దేలా చర్యలు తీసుకోవాలన్నారు.నూతన ఓటర్ల చేర్పులు,ఇతరులు మారిపోయినట్లైతే తొలగింపులు-ఇవన్నీ పూర్తిగా ఆధారాలతో చేయాలని ఆయన సూచించారు.సర్వేకు సంబంధించిన తేదీలను త్వరలో అధికారిక ప్రకటనల ద్వారా తెలియజేస్తామని స్పష్టం చేశారు.అదేవిధంగా,ఒకే పోలింగ్ బూత్ లో 1200 మందికి మించిన ఓటర్లు ఉన్నట్లయితే,అదనపు బూత్ ఏర్పాటు చేయాలని జిల్లా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలన్నారు.ప్రతి బూత్ స్థాయిలో రాజకీయ పార్టీల తరపున ఓ బూత్ లెవెల్ ఏజెంట్ ఉండేలా చూసుకోవాలని,వారు ఎన్నికల ప్రక్రియలో సిబ్బందికి సహకరించేలా తగిన అవగాహన కల్పించాలన్నారు.ఈ సమావేశంలో స్టేషన్ ఘనపూర్ రెవెన్యూ డివిజనల్ అధికారి డి.ఎస్.వెంకన్న,స్థానిక తహసిల్దార్ వెంకటేశ్వర్లు,నియోజకవర్గంలోని అన్ని మండలాల తహసిల్దార్లు,సూపర్వైజర్లు,ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.