ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి పునాది
16వ జాతీయ ఓటరు దినోత్సవంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పిలుపు
కొత్త ఓటర్లకు గుర్తింపు కార్డుల పంపిణీ – సీనియర్ సిటీజన్లకు సత్కారం
ఓటరు అవగాహన సైకిల్ ర్యాలీ ప్రారంభం
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత పవిత్రమైనదని,అర్హత కలిగిన ప్రతి ఓటరు తప్పనిసరిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పిలుపునిచ్చారు.ఓటు హక్కు ద్వారా ప్రజలు తమ అభిప్రాయాన్ని స్వేచ్ఛగా వ్యక్తపరచి ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయగలరని ఆయన పేర్కొన్నారు.ఆదివారం జిల్లా కేంద్రంలోని ఐడీఓసీ కార్యాలయ సమావేశపు హాలులో నిర్వహించిన 16వ జాతీయ ఓటరు దినోత్సవం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.ముఖ్యంగా యువత ఓటరు జాబితాలో తమ పేర్లు నమోదు చేసుకొని ప్రతి ఎన్నికలో చురుకుగా పాల్గొనాలని సూచించారు.ఈ సందర్భంగా కొత్తగా నమోదు అయిన ఓటర్లకు ఓటరు గుర్తింపు కార్డులను కలెక్టర్ అందజేశారు.అలాగే ప్రజాస్వామ్య ప్రక్రియలో నిరంతరంగా పాల్గొంటూ ఆదర్శంగా నిలిచిన సీనియర్ సిటీజన్ ఓటర్లను శాలువాలతో సత్కరించారు.అదేవిధంగా ఎన్నికల విధుల్లో నిబద్ధతతో సేవలందించిన బిఎల్ఓలు, సూపర్వైజర్లు, చేంజ్ ఆపరేటర్లకు ప్రశంసాపత్రాలు అందజేశారు.ఓటరు అవగాహన కార్యక్రమాల ద్వారా ప్రజల్లో చైతన్యం పెంపొందించాల్సిన అవసరం ఎంతగానో ఉందని కలెక్టర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.ప్రతి అర్హ పౌరుడు ఓటు హక్కు నమోదు చేసుకొని ఎన్నికల సమయంలో తప్పనిసరిగా వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ఓటు హక్కు నమోదు,వినియోగంపై ప్రతిజ్ఞను కలెక్టర్ చేయించారు.తదుపరి విద్యార్థులచే నిర్వహించిన ఓటరు అవగాహన సైకిల్ ర్యాలీని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ జెండా ఊపి ప్రారంభించారు.ఈ ర్యాలీ ద్వారా ప్రజల్లో ఓటు హక్కుపై అవగాహన పెంచడమే లక్ష్యమని అధికారులు తెలిపారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, ఆర్డీఓ హరికృష్ణ,జిల్లా అధికారులు,ఎన్నికల విభాగ సిబ్బంది,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.