కార్మికుడిని పరామర్శించిన టీఆర్పీ జిల్లా అధ్యక్షుడు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వంద పడకల దవాఖానలో చికిత్స పొందుతున్న కార్మికుడిని తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్పీ) భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ బుధవారం పరామర్శించారు.కార్లమస్ కాలనీకి చెందిన కన్నివేని సత్యం (మేస్త్రీ) ఇటీవల జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడగా,ఆయన ఆరోగ్య పరిస్థితిని రవి పటేల్ దగ్గరుండి తెలుసుకున్నారు.భూపాలపల్లి ఒకటవ గని ప్రాంగణంలో దుబ్యాల దేవేందర్ రావు కాంట్రాక్టర్ నిర్మిస్తున్న షెడ్లలో మేస్త్రీగా పని చేస్తున్న సమయంలో, కన్నివేని సత్యం ప్రమాదవశాత్తు షెడ్డుపై నుంచి కిందపడి రెండు కాళ్లు విరగడంతో తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం వంద పడకల ప్రభుత్వ దవాఖానలో చికిత్స పొందుతున్నారు.ఆసుపత్రిని సందర్శించిన రవి పటేల్ వైద్యులను అడిగి చికిత్స వివరాలు తెలుసుకొని,బాధితుడికి మెరుగైన వైద్యం, అవసరమైన శస్త్రచికిత్సలు అందించాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రోజువారీ కూలీపై ఆధారపడి జీవించే ఈ కుటుంబానికి ఈ ప్రమాదం తీవ్ర ఆర్థిక భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.అయితే ప్రమాదం జరిగి ఏడు రోజులు గడిచినా కూడా సంబంధిత కాంట్రాక్టర్ బాధితుడిని పరామర్శించకపోవడం,కుటుంబానికి అండగా నిలబడకపోవడం అత్యంత దురదృష్టకరమని రవి పటేల్ మండిపడ్డారు.తన వద్ద పని చేసే కార్మికుడికి ఇలాంటి ప్రమాదం జరిగితే, అతడి వైద్య ఖర్చులు భరించడం, అవసరమైన ఆపరేషన్లు చేయించడం, కుటుంబాన్ని ఆదుకోవడం కాంట్రాక్టర్ యొక్క నైతిక బాధ్యత అని స్పష్టం చేశారు.కాబట్టి వెంటనే కన్నివేని సత్యం కుటుంబాన్ని ఆదుకొని, ఆసుపత్రి ఖర్చులు పూర్తిగా భరించి, మెరుగైన వైద్యం అందించాలని కాంట్రాక్టర్ను రవి పటేల్ డిమాండ్ చేశారు.కార్మికుల శ్రేయస్సే లక్ష్యంగా కాంట్రాక్టర్లు మానవతా దృక్పథంతో బాధ్యతగా వ్యవహరించాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.