కార్మికులకు పెండింగ్ వేతనాలు చెల్లించాలి
ఖమ్మం నగర కార్పొరేషన్ పరిధిలో ఉన్న లకారం పార్కులో పనిచేస్తున్న స్వీపర్స్ కి, సూపర్వైజర్స్ కి రావలసిన నాలుగు నెలల పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి తుమ్మ విష్ణువర్ధన్, జిల్లా ఉపాధ్యక్షులు పిన్నింటి రమ్య అధికారులను డిమాండ్ చేశారు. మంగళవారం సిఐటియు ఆధ్వర్యంలో పార్కులో పనిచేస్తున్న 20 మంది కార్మికులు ఖమ్మం కార్పొరేషన్ ముందు ధర్నా చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడుతూ గత అక్టోబర్ నెల నుండి నాలుగు నెలలు గా జీతాలు ఇవ్వకుండా కార్మికులను ఇబ్బందులకు గురిచేస్తున్న అధికారుల నిర్లక్ష్యాన్ని వారు తీవ్రంగా విమర్శించారు. కార్మికులు అక్టోబర్ నుండి వేతనాలు రాక సంక్రాంతి పండగ రోజు కూడా పస్తులు ఉండే పరిస్థితిని కల్పించడం హేయమైన చర్య అని, కార్మికులతో వెట్టిచాకిరి చేయించుకొని జీతాలు ఇవ్వకుండా ఆపడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. జీతాలు చెల్లించాల్సిన కాంట్రాక్టర్ తన కాంట్రాక్ట్ కాలం అయిపోయిందని నేను వేతనాలు ఇవ్వలేనని వెళ్ళిపోగా అధికారులు అతనిపై చర్య తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరైంది కాదని, తాము గతంలో అనేకసార్లు అధికారుల దృష్టికి తీసుకుపోగా ఇదిగో, అదిగో అంటూ కాలయాపన చేశారని, ఇప్పటికైనా కమిషనర్ చర్య తీసుకొని కార్మికులకు ఇవ్వాల్సిన పెండింగ్ వేతనాలను వెంటనే ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.వెంటనే వారికి వేతనాలు చెల్లించకపోతే భవిష్యత్తులో ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో ఉన్న కార్మికుల అందరితో కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో:సిఐటియు జిల్లానాయకులు జిల్లా ఉపేందర్, గాలి వెంకటాద్రి, కార్మికులు పిన్నింటి శ్రీనివాస్, సుజాత, ఇందిర, శైలజ, మరియమ్మ తదితరులు పాల్గొన్నారు.