మున్సిపల్ సిబ్బంది,అధికారుల నిర్లక్ష్యంపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం

ఈ69న్యూస్ వరంగల్
వరంగల్ జిల్లా ఖిలా వరంగల్ మండల పరిధిలోని నాయుడు పెట్రోల్ పంపు ప్రాంతం ఈ మధ్య కాలంలో ప్రజలకు భయానకంగా మారింది.వారం,పది రోజులుగా చెత్త గుట్టలు పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతుండగా,డ్రైనేజీలు మోరీలు ఎత్తకపోవడంతో పూర్తిగా మూసుకుపోయాయి.ఫలితంగా నీరు ఆగిపోవడం,చెత్త దిబ్బలు పెరగడం వల్ల స్థానికులు ఊపిరి పీల్చుకోలేని పరిస్థితి నెలకొంది.సానిటేషన్ సిబ్బంది ఎప్పుడూ కనిపించరని,చెత్తను తరలించే వాహనాలు రాకపోవడం వల్ల సమస్య మరింత తీవ్రం అవుతోందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.వర్షాకాలం కారణంగా మురుగు నీరు,చెత్త కలిసిపడి దుర్వాసనతో పాటు దోమలు విపరీతంగా పెరిగి,డెంగీ,వైరల్ జ్వరాలు,మలేరియా వంటి వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు.ప్రజలు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు మాత్రం చెవిటి వేషం వేస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు.మున్సిపాలిటీ ఉన్నా లేనట్టే ఉంది.కాగితం మీదే సిబ్బంది ఉన్నారేమో కానీ,పనిలో మాత్రం కనిపించడం లేదు.చిన్న చిన్న సమస్యలు కూడా పరిష్కరించలేని అధికారులు పదవుల్లో ఎందుకు కూర్చున్నారు?”అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.ఈ నిర్లక్ష్య వైఖరిపై మున్సిపల్ ఉన్నతాధికారులు వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.లేకపోతే ప్రజలు భారీ స్థాయిలో ఆందోళన చేపట్టే పరిస్థితి వస్తుందని హెచ్చరిస్తున్నారు.