గిరిజన సంక్షేమ మినీ గురుకులం కాంట్రాక్టు ఉద్యోగులకు వేతనాలను రాష్ట్ర ప్రభుత్వం పెంచడంపట్ల గిరిజన సంక్షేమ మినీ గురుకులాల కాంట్రాక్టు ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వి. నిర్మల, నీలావతి హర్షం వ్యక్తంచేశారు. వేతనాలు పెంచిన రాష్ట్ర ప్రభుత్వానికి, సహకరించిన అధికారులకు, ఉద్యమంలో పాల్గొన్న ఉద్యోగులకు ధన్యవాదాలు తెలిపారు. గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న 29 మినీ గురుకులాల్లో పని చేస్తున్న 418 మంది కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాలను 30% పెంచుతూ, సర్వీసులను ఈ విద్యా సంవత్సరం వరకు పొడిగిస్తూ జి.ఓ నెం. 1407 ను ఆర్థిక శాఖ సహాయ కార్యదర్శి హరిత విడుదల చేశారు. గిరిజన సంక్షేమ మినీ గురుకులాల కాంట్రాక్టు ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో సి.ఎం క్యాంపు ఆఫీసు ముట్టడి, మినిష్టర్ క్వాటర్స్ ముట్టడి ,గురుకులం హెడ్ ఆఫీస్ వద్ద ధర్నాలు నిర్వహించడం జరిగింది. అనేక సందర్భాల్లో అరెస్టులు, పోలీసు స్టేషన్ లో నిర్బంధాలు చేసారు. ఐనా ఉద్యమం కొనసాగింది. యూనియన్ నిరంతరం చేసిన కృషి, పోరాటాల ఫలితంగా వేతనాలు పెరిగాయి. వేతనాల పెరుగుదలకు జరిగిన పోరాటాల స్ఫూర్తితో గిరిజన మినీ గురుకులాలను రాష్ట్ర ప్రభుత్వం టేకోవర్ చేసుకొని, కాంట్రాక్టు ఉద్యోగులందరిని రెగ్యులరైజ్ చేసేంతవరకు ఐక్యంగా ఉద్యమించాలని కోరారు.