గృహజ్యోతి పథకం వెబ్సైట్ పునఃప్రారంభం చేయాలి
జఫర్గడ్ మండల కేంద్రంలోని మండల అభివృద్ధి అధికారి కార్యాలయం ఎదుట భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) ఆధ్వర్యంలో గృహజ్యోతి పథకం పునఃప్రారంభం చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు.అనంతరం పార్టీ నాయకులు సీనియర్ అసిస్టెంట్‌కు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు,మండల కార్యదర్శి జువారి రమేష్ మాట్లాడుతూ..రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన గృహజ్యోతి పథకం పేదలకు బలమైన అండగా నిలవాల్సిందని,అయితే ప్రస్తుతం దాన్ని పూర్తిగా విస్మరించారని విమర్శించారు.పేదలు,బడుగు బలహీన వర్గాల లబ్ధిదారులు విద్యుత్ బిల్లులు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.50 యూనిట్లలోపే వినియోగం చేసినా కూడా బిల్లులు వేస్తున్నారని,కలెక్షన్ అధికారులు సమస్యను పరిష్కరించడంలో విఫలమయ్యారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.లబ్ధిదారులు స్థానిక అభివృద్ధి అధికారులను సంప్రదించినా“వెబ్సైట్ పనిచేయడం లేదు,రాకండి”అని నిరుత్సాహపరుస్తున్నారని పేర్కొన్నారు.రమేష్ ప్రభుత్వం వెంటనే గృహజ్యోతి పథకం వెబ్‌సైట్‌ను పునఃప్రారంభించి లబ్ధిదారులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.లేనిపక్షంలో ఆందోళనలు చేపట్టాల్సి ఉంటుందని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల అధ్యక్షులు,కార్యదర్శులు ఎం.డి.యాకుబ్ పాషా,పెండ్యాల సమ్మయ్య, మండల గట్టుమల్లు,అన్నెపు అజయ్,శ్రీను,అబ్బారాబోయిన ముసలయ్య తదితరులు మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు.