ఘనంగా ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం
ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా స్టేషన్ ఘన్పూర్ జలాశయం కట్టపై మత్స్యకారుల ప్రతీక అయిన నీలి రంగు జెండాను సంఘం గ్రామ అధ్యక్షుడు గోనెల యాదగిరి ఆవిష్కరించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ మత్స్యకారులు-మత్స్య కార్మిక సంఘం(టీ.ఎం.కే.ఎం.కే.ఎస్)జనగామ జిల్లా ప్రధాన కార్యదర్శి మునిగెల రమేష్ హాజరయ్యారు.ఈ సందర్భంగా మాట్లాడిన రమేష్,“దేశ ఆర్థిక వ్యవస్థలో ముఖ్య పాత్ర పోషిస్తున్న మత్స్యకారుల జీవన పరిస్థితులు దయనీయంగా ఉన్నాయి.వారి సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయి”అని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వాల వద్ద సరైన ప్రణాళికలు లేవని విమర్శిస్తూ,చైనా,వియత్నాం వంటి దేశాల్లో చేపల ఆధారంగా ఔషధాలు,అందాల సాధనాలు సహా అనేక పరిశ్రమలు అభివృద్ధి చెందినట్టు గుర్తుచేశారు.భారతదేశంలో కూడా ఇలాంటి పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ఎంతో అవకాశాలు ఉన్నప్పటికీ ప్రభుత్వాలు వాటిని పట్టించుకోవడం లేదని రమేష్ మండిపడ్డారు.అలాగే ఆయన ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చిన ముఖ్య డిమాండ్లు:-జాతీయ సహకార అభివృద్ధి సంఘం (ఎన్.సీ.డి.సీ),జాతీయ మత్స్య అభివృద్ధి మండలి (ఎన్.ఎఫ్.డి.బి)ద్వారా ప్రత్యేక పథకాలు,ప్రతి మత్స్యకారుడికి లబ్ధి చేకూరే విధంగా కార్యాచరణ,కేరళ రాష్ట్రం మాదిరిగా 20 లక్షల రూపాయల ఎక్స్-గ్రేషియా మరియు బీమా,మహిళా సంఘాలకు 10 లక్షల రూపాయల రుణం,జిల్లా-మండల కేంద్రాల్లో చేపల మార్కెట్లు,చేపలకు మద్దతు ధర ప్రకటించడం.అదే విధంగా స్టేషన్ ఘన్పూర్ జలాశయం వద్ద చేపల ఉత్పత్తి కేంద్రం నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరారు.టీ.ఎం.కే.ఎం.కే.ఎస్ రాష్ట్ర మహాసభలు ఈ నెల 25,26 తేదీల్లో కరీంనగర్లో నిర్వహించనున్నట్టు తెలియజేస్తూ,తొలి రోజు జరిగే రాష్ట్ర సదస్సుకు మత్స్యకారులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని రమేష్ పిలుపునిచ్చారు.ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా అన్ని మత్స్య శ్రామికులకు శుభాకాంక్షలు తెలిపారు.కార్యక్రమంలో ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షుడు నీలగట్టయ్య,టీ.ఎం.కే.ఎం.కే.ఎస్ మండల అధ్యక్షుడు గోనెల వెంకన్న,సంఘం అధ్యక్షుడు నీల సోమన్న,నిర్వాహకులు మునిగెల వెంకన్న,మునిగెల ఐలోని,గోనెల ఉప్పలయ్య,కుంభం సాంబరాజు,నీల సాంబరాజు,నక్క శ్రీను,మాజీ మండల పరిషత్ సభ్యులు మునిగెల రాజు,గోనెల రాజయ్య,నీల శ్రీధర్,గోనెల చందు,గోనెల అనిల్,ఇతర నాయకులు గోనెల పరుశురాముడు తదితరులు పాల్గొన్నారు.