డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీలో జరుగుతున్న అన్యాయం
భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీలో జరుగుతున్న అన్యాయంపై తెలంగాణ రాజ్యాధికార పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.అర్హులైన పేద ప్రజలకు వెంటనే ఇళ్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్రంలో టీఆర్పి జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.ధర్నా కార్యక్రమంలో మాట్లాడుతూ రవి పటేల్ గత పదేళ్లుగా బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు పేదల ఆశలను వాడుకున్నాయని, ఇళ్ల పేరుతో ప్రజలను మోసం చేశాయని విమర్శించారు. ఇల్లు కలను నెరవేర్చుకోవడానికి రోడ్లపై నిరసనలు, రాస్తారోకాలు చేస్తూ వున్న ప్రజలకు ఇప్పటికీ న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
“ప్రస్తుత ప్రభుత్వాన్ని ప్రజా పాలన అంటున్నా… పేదలపై జరుగుతున్న ఆకృత్యాలు గత ప్రభుత్వాల కంటే ఎక్కువ” అని ఆయన ఆరోపించారు. భూపాలపల్లి మున్సిపాలిటీలో కేవలం కాంగ్రెస్ నాయకులకు అనుబంధంగా ఉన్నవారికి మాత్రమే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తున్నారని, అర్హులైన పేదల పేర్లను నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు.కేవలం కాంగ్రెస్ కండువా కప్పుకున్న వారికి మాత్రమే ఇళ్లు… పేదల్ని మోసం చేసే పాలన ఇది” రవి పటేల్ విమర్శ,ఇళ్ల కోసం సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న నిజమైన అర్హులైన లబ్ధిదారుల హక్కులను రక్షించడానికి టీఆర్పి పోరాడుతుందని ప్రకటించారు. కలెక్టర్, ఎమ్మెల్యే వెంటనే పేదల పరిస్థితిని పరిశీలించి అర్హులైన వారందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.అలా చేయనట్లయితే పెద్దఎత్తున నిరసనలు, ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో టీఆర్పి జిల్లా నాయకులు సామల శ్రీలత, చంద్రశేఖర్, రోడ్డ శ్రీనివాస్, శ్రీకాంత్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.