నరేగా హక్కులను కాపాడేందుకే కాంగ్రెస్ పోరాటం
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని (నరేగా) రద్దు చేసి, దాని స్థానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వీబీజీ–రామ్ జీ అనే కొత్త చట్టం గ్రామీణ పేదల ఉపాధి హక్కులను హరిస్తోందని, దీనికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు స్పష్టం చేశారు.తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భూపాలపల్లి మండలం కొంపల్లి గ్రామంలో నిర్వహించిన “నరేగా బచావో – సంగ్రామ్” గ్రామసభ మరియు నిరసన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బట్టు కరుణాకర్ కూడా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ,
నరేగా పథకం గ్రామీణ ప్రజలకు జీవనాధారంగా నిలిచిందని, కోట్లాది మంది కూలీలు ఈ చట్టం ద్వారా ఉపాధి పొందుతున్నారని అన్నారు. అలాంటి చట్టాన్ని రద్దు చేసి, కార్పొరేట్ వర్గాలకు మేలు చేసే విధంగా కొత్త చట్టాన్ని తీసుకురావడం ప్రజా వ్యతిరేక చర్య అని విమర్శించారు. గ్రామీణ పేదల హక్కులను హరించే ప్రయత్నాలను కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదని, అవసరమైతే దేశవ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు బట్టు కరుణాకర్ మాట్లాడుతూ,నరేగా చట్టం కేవలం ఉపాధి మాత్రమే కాకుండా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసిన చట్టమని తెలిపారు. ఈ చట్టాన్ని బలహీనపరిచే ప్రయత్నాలకు వ్యతిరేకంగా గ్రామస్థాయి నుంచి ఉద్యమాన్ని విస్తరించాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.అనంతరం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పిల్లోనిపల్లి (పుల్లూరి రామయ్యపల్లి) గ్రామంలో నూతనంగా నిర్మించనున్న బీరప్ప దేవాలయ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధికి తమ వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఆయన తెలిపారు