బాలికల భద్రతే ధ్యేయంగా నిరంతర సేవలు
భద్రాచలం ఐటిడీఏ ఆధ్వర్యంలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకలు గిరిజన బాలికల భద్రత, సంక్షేమం, విద్యా అభివృద్ధికి అంకితమైన సేవలకు ప్రతీకగా నిలిచాయి. గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో పనిచేస్తూ, వసతి గృహాల్లో నివసిస్తున్న బాలికలకు సంపూర్ణ భద్రతతో పాటు ప్రభుత్వ నుండి లభించే అన్ని రకాల సౌకర్యాలు సమయానికి, సంపూర్ణంగా అందేలా నిరంతరం శ్రమిస్తున్న అధికారుల కృషికి ఈ సందర్భంగా అధికారిక గుర్తింపు లభించింది.
ఈ వేడుకల్లో కొత్తగూడెం గిరిజన కళాశాల బాలికల వసతి గృహం హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ (హెచ్.డబ్ల్యు.ఓ) ఎమ్.కృష్ణవేణి సేవలను ప్రత్యేకంగా గుర్తించిన ఐటిడీఏ పీ.ఓ రాహుల్ ఐ.ఏ.ఎస్ ఆమెకు ప్రశంసా పత్రాన్ని అందజేశారు. వసతి గృహంలో నివసిస్తున్న ప్రతి బాలిక భద్రతే ప్రథమ ప్రాధాన్యంగా తీసుకొని, 24 గంటల పర్యవేక్షణ, కఠిన క్రమశిక్షణ, సిబ్బందిపై నిరంతర నియంత్రణతో పాటు ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు అవకాశం లేకుండా తీసుకుంటున్న చర్యలు అధికారులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
అదేవిధంగా ప్రభుత్వం అందిస్తున్న భోజనం, వసతి, ఆరోగ్య సంరక్షణ, విద్యా ప్రోత్సాహక పథకాలు, స్కాలర్షిప్లు, అవసరమైన వస్తువులు వంటి అన్ని సౌకర్యాలు ఒక్క విద్యార్థినికీ లోటు లేకుండా చేరేలా ఎమ్.కృష్ణవేణి నిరంతరం పర్యవేక్షణ చేస్తూ, సమస్యలు తలెత్తిన వెంటనే పరిష్కరించే విధానం ప్రశంసనీయమని అధికారులు పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు కాగితాలకే పరిమితం కాకుండా, క్షేత్రస్థాయిలో బాలికల జీవితాలను మార్చేలా అమలవుతున్నాయంటే అందులో ఆమె పాత్ర కీలకమని అన్నారు.
బాలికలు భౌతికంగా మాత్రమే కాకుండా మానసికంగా కూడా ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో ఎదగాలనే ఉద్దేశంతో వారితో నిరంతర సంభాషణలు జరపడం, చదువుతో పాటు జీవితంపై స్పష్టత కలిగేలా మార్గనిర్దేశం చేయడం, అవసరమైన సందర్భాల్లో తల్లిదండ్రులు మరియు ఉన్నతాధికారులతో సమన్వయం చేసుకుంటూ వారికి అండగా నిలవడం ఆమె సేవల ప్రత్యేకతగా పేర్కొన్నారు. ఆమె ఆధ్వర్యంలో వసతి గృహం బాలికలకు కేవలం నివాస స్థలంగా కాకుండా, భద్రత, నమ్మకం, అవకాశాలు కలిగిన కుటుంబ వాతావరణంగా మారిందని ప్రశంసించారు.
ఈ సందర్భంగా ప్రశంసా పత్రం అందుకున్న కృష్ణవేణి మాట్లాడుతూ, గిరిజన బాలికలు ఎలాంటి భయాలు లేకుండా చదువుపై పూర్తిగా దృష్టి పెట్టి, జీవితంలో ఉన్నత స్థానాలకు చేరాలన్నదే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఈ గౌరవం తన వ్యక్తిగత కృషికి మాత్రమే కాకుండా వసతి గృహంలో పనిచేస్తున్న సిబ్బంది అందరి సమిష్టి శ్రమకు లభించిన గుర్తింపుగా భావిస్తున్నానని చెప్పారు. భవిష్యత్తులో కూడా బాలికల భద్రత, గౌరవం, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ సంక్షేమ పథకాలు మరింత సమర్థవంతంగా అమలయ్యేలా అంకితభావంతో సేవలు అందిస్తానని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమం ద్వారా గిరిజన బాలికల రక్షణ, విద్య, సంక్షేమానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత స్పష్టంగా కనిపించిందని పలువురు అభిప్రాయపడ్డారు. ఇలాంటి నిబద్ధతతో పనిచేసే అధికారులు ఉన్నంతకాలం వసతి గృహాలు బాలికలకు నిజమైన భద్రతా కవచంగా, భవిష్యత్తుకు బాటలు వేసే కేంద్రాలుగా నిలుస్తాయని వారు పేర్కొన్నారు.