జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని తిరుమలగిరి గ్రామ శివారులో గల శ్రీ బుగులోని వెంకటేశ్వర స్వామి వారి జాతరలో దొంగలు పడ్డారు. సుమారు రూ.10 వేల రూపాయల విలువగల విద్యుత్ వైర్ దొంగలించబడినట్లు అక్కడ పనిచేసే కార్మికులు తెలిపారు. మొన్నటి వరకు వారం రోజులు అంగరంగ వైభవంగా జాతర బ్రహ్మోత్సవాలు జరగగా జాతరకు ముందు పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలోనే 500 ల మీటర్లు గల త్రీ ఫేజ్ విద్యుత్ వైరు సోమవారం రాత్రి వరకు ఉందని మంగళవారం ఉదయం వచ్చేసరికి కనపడటం లేదని అక్కడ పనిచేసే కార్మిక సిబ్బంది తెలిపారు. సుమారు దాని విలువ రూ. 10 వేల రూపాయలు ఉంటుందని వారు అన్నారు. అయితే ప్రతి సంవత్సరం జాతర ముగిసిన అనంతరం ఇక్కడ ఎవరు ఉండరని దీంతో జాతర ప్రాంగణంలో మోటార్లు, విద్యుత్ తీగలు, విద్యుత్ దీపాలు, పైపులు ఇలా చాలా రకాలుగా ఏదో ఒకటి దోపిడీకి గురవుతున్నట్లు స్థానికులు తెలిపారు.జాతర ప్రాంగణంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే తప్ప ఈ ఆనవాయితికి తెరపడదని భక్తులు అంటున్నారు.