
–సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నిరసన
భద్రాచలం పట్టణ ప్రజలకు కేసీఆర్ ఇచ్చిన హామీలు పై కేటీఆర్ సమాధానం చెప్పాలని, వాగ్దానాలు నెరవేర్చని కేటీఆర్ కు భద్రాచలం వచ్చే అర్హత లేదని, భద్రాచలం అభివృద్ధి పట్ల టిఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి నిరసిస్తూ సిపిఎం భద్రాచలం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక అంబేద్కర్ సెంటర్లో ప్లకార్డులు చేతబూని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పార్టీ పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎంబి నర్సారెడ్డి లు మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి భద్రాచలం అభివృద్ధి పట్ల తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తుందని విమర్శించారు. దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన సీతారాముల కళ్యాణం శ్రీరామనవమికి తలంబ్రాలు తేకుండా ముఖం చాటేస్తూ కేసీఆర్ రాముని పట్ల కూడా తీవ్ర వివక్షత చూపారని అన్నారు. రేపు ఐటీ పురపాలక శాఖ మంత్రి కేసీఆర్ తనయుడు కేటీఆర్ భద్రాచలం వస్తున్న సందర్భంగా…. ముఖ్యమంత్రి మొదటిసారి భద్రాచలం వచ్చినప్పుడు ప్రకటించిన 100 కోట్ల సంగతేంటి? గత సంవత్సరం వరదల సమయంలో భద్రాచలం వచ్చి ప్రకటించిన 1000 కోట్లు సంగతేంటి? గోదావరి వరద బాధితులకు ఇస్తామని చెప్పిన డబల్ బెడ్ రూమ్ ఇండ్లు సంగతేంటి? ఒక్క అంగుళం భూమి కూడా వదిలేది లేదని పోలవరం పేరుతో ఎనిమిది మండలాలు ఆంధ్రాలో కలిపిన నోరు మెదపని కేసీఆర్ గారూ భద్రాచలంలో కలపాలని ప్రజలు అడుగుతున్న ఐదు పంచాయితీల సంగతేంటి? పోలవరం బ్యాక్ వాటర్ తో భద్రాచలం కు పొంచి ఉన్న ప్రమాదం పై టీఆర్ఎస్ వైఖరి ఏంటి? భద్రాచలం పట్టణానికి రక్షణ కవచంగా ఉన్న కరకట్ట నిర్మాణాన్ని పటిష్టపరిచేందుకు గోదావరికి ఇరువైపులా పొడిగించేందుకు నిధులు కేటాయింపు సంగతేంటి? గత తొమ్మిదిన్నర ఏళ్లలో భద్రాచలం అభివృద్ధి పట్ల టిఆర్ఎస్ నిర్లక్ష్య వైఖరి సంగతేంటి? యాదాద్రి లా భద్రాద్రి అభివృద్ధి జరుగుతుంది అని ప్రకటించిన నీహామీ సంగతేంటి? జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇచ్చి డబల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టిస్తామని ఇచ్చిన హామీ సంగతేంటి? ఈ అంశాలపై భద్రాచలం ప్రజలకు టిఆర్ఎస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కెసిఆర్ ఇచ్చిన హామీలపై కేటీఆర్ సమాధానం చెప్పాలని అన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ ముందు అరకురా నిధులు మంజూరు చేసి ప్రారంభోత్సవాలు చేసుకోవడం సిగ్గుచేటని అన్నారు. ఇది చిత్తశుద్ధి లేని ఎలక్షన్ డ్రామా అని విమర్శించారు. మీ పిట్టల దొర మాటలు, మీ మాయలు నమ్మడానికి మరోసారి మోసపోవడానికి ప్రజలు సిద్ధంగా లేరని రానున్న ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతారని అన్నారు. చిత్తశుద్ధి ఉంటే ఇచ్చిన హామీలు నిధులు మంజూరు చేసి భద్రాచలం రావాలని హితవు పలికారు. లేకుంటే ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యురాలు సున్నం గంగా, పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు బి వెంకటరెడ్డి పట్టణ కమిటీ సభ్యులు ఎన్ నాగరాజు, యు జ్యోతి, కుంజా శ్రీనివాస్ సండ్ర భూపేంద్ర కోరాడ శ్రీనివాస్, డి రామకృష్ణ కాపుల దుర్గారావు, లక్ష్మి, మురళీకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.