
మతసామరస్యానికి మరో పేరు అహ్మదియ్య ముస్లిం జమాత్

ఈ69న్యూస్ ఈస్ట్ గోదావరి
కోనసీమ జిల్లాలో మత ఐక్యతకు నిలువెత్తు నిదర్శనం.శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని,కోనసీమ జిల్లా అలమూరు మండలం చిలకలపాడు గ్రామంలో,అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీ ఆధ్వర్యంలో రామాలయాల వద్ద ఉచిత మజ్జిగ పంపిణీ చేయడం మతసామరస్యానికి చక్కటి ఉదాహరణగా నిలిచింది.హిందువుల పండుగను సోదర భావంతో ఆలయాల వద్ద స్వయంగా పాల్గొని మజ్జిగ పంపిణీ చేయడం గ్రామస్థుల హృదయాలను హత్తుకుంది.ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు షేక్ సుల్తాన్ మాట్లాడుతూ..మా కమ్యూనిటీ స్థాపకులు హజ్రత్ మిర్జా గులాం అహ్మద్ శ్రీరామచంద్ర మహారాజు,శ్రీకృష్ణ మహారాజుల్ని దైవ సందేశహరులుగా పేర్కొంటూ,అన్ని మతాల సారాంశం ఒకటేనని బోధించారు.ఇదే సందేశాన్ని తీసుకొని మేము దేశవ్యాప్తంగా మత సామరస్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.జిల్లా ఇంచార్జ్ మహమ్మద్ సిరాజ్ మాట్లాడుతూ..అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీ 1889లో పంజాబ్లో స్థాపితమై,నేడు 200కి పైగా దేశాల్లో శాంతి,సమానత్వం,మానవతా సేవలను హ్యూమానిటీ ఫస్ట్,ఖిద్మతె ఖల్క్ శాఖల ద్వారా కొనసాగిస్తోంది.ప్రస్తుత ఖలీఫా హజ్రత్ మిర్జా మస్రూర్ అహ్మద్ నేతృత్వంలో సేవా కార్యక్రమాలు శక్తివంతంగా కొనసాగుతున్నాయన్నారు.సర్వ మత సమ్మేళనమే మా లక్ష్యమని”సర్వ మతాలను,గ్రంథాలను,అవతారులను గౌరవించాలన్నదే మా అభిమతం”అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మహమ్మద్ జావిద్ అహ్మద్ (రాష్ట్ర ప్రజా సంబంధాల ప్రతినిధి),మౌల్వి ముహమ్మద్ అక్బర్,మీను పాషా,గుల్ మీరా తదితరులు పాల్గొన్నారు.గ్రామస్థులు ఈ సంఘం చేస్తున్న సేవ కార్యక్రమాలను హృదయపూర్వకంగా అభినందించారు.