ముగిసిన ‘యువ చైతన్య సైకిల్ యాత్ర’

ఈ69న్యూస్ మిర్యాలగూడ
మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండి, మంచి భవిష్యత్తు కోసం కృషి చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు పిలుపునిచ్చారు. గంజాయి, డ్రగ్స్ నిర్మూలనతో పాటు సోషల్ బెట్టింగ్ యాప్లను నిషేధించాలని డిమాండ్ చేస్తూ, డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో చేపట్టిన ‘యువ చైతన్య సైకిల్ యాత్ర’ శనివారం మిర్యాలగూడలో ముగిసింది.
ఈ సందర్భంగా నిర్వహించిన ముగింపు సభలో నాయకులు మాట్లాడుతూ, నేటి బాలలే రేపటి దేశ పౌరులని, యువత చెడు అలవాట్లకు బానిస కాకుండా ఉన్నత లక్ష్యాల వైపు అడుగులు వేయాలని సూచించారు. సరదాగా మొదలయ్యే చెడు అలవాట్లు జీవితాన్నే నాశనం చేస్తాయని హెచ్చరించారు.
జూలై 24న నకిరేకల్ నుండి ప్రారంభమైన ఈ యాత్ర, 25 మండలాలు, 6 మున్సిపాలిటీలు కవర్ చేస్తూ దాదాపు 450 కిలోమీటర్లపాటు సాగింది. గ్రామాల పాఠశాలలు, కళాశాలలలో అవగాహన సదస్సులు నిర్వహించి, యువతలో మత్తుపదార్థాలపై చైతన్యం కలిగించారు. ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని నిర్వాహకులు తెలిపారు.
ముగింపు సభలో విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించడంతో పాటు, యాత్రలో పాల్గొన్న నాయకులను జూలకంటి రంగారెడ్డి శాలువా, పూలదండలతో సత్కరించారు. కార్యక్రమంలో డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు కోట రమేష్, సైన్స్ విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు డా. మువ్వా రామారావు, సామాజికవేత్త డా. మునీర్, సిపిఎం జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు.
డివైఎఫ్ఐ నాయకులు యువతను మతం, మతోన్మాదం వైపు మళ్లించాలనే పాలకుల కుతంత్రాలను ఖండిస్తూ, నిరుద్యోగానికి విరుగుడిగా ప్రభుత్వాలు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎదిరించేందుకు యువత ఉద్యమాల వైపు అడుగులు వేయాలని పిలుపునిచ్చారు.