మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు మొండిచెయ్యి
కామారెడ్డి డిక్లరేషన్‌తో బీసీలను నిండా ముంచిన కాంగ్రెస్-గుంజపడుగు హరిప్రసాద్
మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ వర్గాలకు మొండిచెయ్యి చూపిందని తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ తీవ్రంగా విమర్శించారు.కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు దండుకున్న కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు బీసీ రిజర్వేషన్లను క్రమంగా తగ్గిస్తూ మోసం చేస్తోందన్నారు.దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచీ బీసీ వర్గాలకు తీవ్ర అన్యాయం చేస్తూనే ఉందని, దాని కొనసాగింపుగానే తెలంగాణలో కూడా బీసీలను రాజకీయంగా పైకి రాకుండా అణచివేస్తోందని హరిప్రసాద్ ఆరోపించారు.ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను భారీగా తగ్గించడంతో అనేక చోట్ల బీసీలకు అవకాశాలు దక్కలేదని తెలిపారు.అదే విధానాన్ని ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో కూడా అమలు చేస్తున్నారని విమర్శించారు.గత మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు దక్కితే, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన లెక్కల ప్రకారం రాష్ట్రంలో 56 శాతం జనాభా ఉన్న బీసీలకు కేవలం 31 శాతం మాత్రమే రిజర్వేషన్లు కల్పించడమేనని పేర్కొన్నారు.ఇది బీసీ వర్గాల పట్ల కాంగ్రెస్ పార్టీకి ఉన్న ద్వంద్వ వైఖరిని స్పష్టంగా చూపిస్తోందన్నారు.ఇప్పుడు అమలవుతున్న బీసీ రిజర్వేషన్ విధానంపై రాహుల్ గాంధీ స్పష్టమైన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.బీసీలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి రానున్న రోజుల్లో ప్రజాక్షేత్రంలో తప్పకుండా తగిన గుణపాఠం జరుగుతుందని హరిప్రసాద్ హెచ్చరించారు.