మున్సిపాలిటీలో 18కి 18 వార్డులు గెలవాలి
ఎంపీ కడియం కావ్య,ఎమ్మెల్యే కడియం శ్రీహరి పిలుపు
స్టేషన్ ఘనపూర్ మున్సిపాలిటీ ఎన్నికల్లో 18కి 18 వార్డులు గెలిచి చరిత్ర సృష్టించాలని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డా.కడియం కావ్య, మాజీ ఉప ముఖ్యమంత్రి,స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పిలుపునిచ్చారు.స్టేషన్ ఘనపూర్ పట్టణ కేంద్రంలోని ఎస్ కన్వెన్షన్లో మంగళవారం నిర్వహించిన మున్సిపాలిటీ ఎన్నికల సన్నాహక సమావేశంలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..అభివృద్ధి,అవినీతిరహిత పాలన లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలనే నినాదంతో ప్రజల్లోకి వెళ్లాలని పార్టీ నాయకులు,కార్యకర్తలకు సూచించారు.మున్సిపాలిటీలోని 18 వార్డుల కోసం వార్డు కమిటీలను,పరిశీలకులను ఏర్పాటు చేసి ప్రచార బాధ్యతలను అప్పగించినట్లు తెలిపారు.ప్రతి వార్డు నుంచి రెండు లేదా మూడు పేర్లతో ఆశావాహుల జాబితాను రేపు సాయంత్రం లోగా అందించాలని ఆదేశించారు.గెలిచే అవకాశాలు ఉన్న అభ్యర్థుల పేర్లనే సూచించాలని కమిటీ సభ్యులకు సూచించారు.మున్సిపాలిటీ అభివృద్ధికి ఇప్పటికే 50 కోట్ల రూపాయలు తీసుకువచ్చామని,మళ్లీ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే మరో 50 కోట్ల రూపాయలు తీసుకువస్తానని ఎమ్మెల్యే కడియం శ్రీహరి హామీ ఇచ్చారు.మున్సిపాలిటీ ఎన్నికలను ఎవరూ తేలికగా తీసుకోవద్దని,ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ జెండా మున్సిపాలిటీపై ఎగరాల్సిందేనని స్పష్టం చేశారు.ఈ ఎన్నికల్లో 100 శాతం విజయం తమదేనని ధీమా వ్యక్తం చేశారు.ఈ సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు,మార్కెట్ కమిటీ చైర్మన్,వైస్ చైర్మన్లు ఐలయ్య,శివకుమార్,చిల్పూర్ ఆలయ కమిటీ చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు,మాజీ జడ్పీటీసీ గుడి వంశీధర్ రెడ్డి,జగదీశ్వర్ రెడ్డి,మాజీ పీఏసీఎస్ చైర్మన్ కర్ణాకర్ రావు,బెలిదే వేంకన్న,మండల పార్టీ అధ్యక్షులు,ఇతర ముఖ్య నాయకులు,వార్డు కమిటీల సభ్యులు పాల్గొన్నారు.