మేడారం జాతర నేపథ్యంలో మునిసిపల్ ఎన్నికలను వాయిదా వేయాలి
లక్షలాది భక్తుల రాకపోకల మధ్య నామినేషన్లు అన్యాయం రవి పటేల్
తెలంగాణ రాష్ట్రంలో త్వరలో ప్రారంభం కానున్న మేడారం సమ్మక్క–సారలమ్మ మహా జాతర నేపథ్యంలో మునిసిపల్ ఎన్నికల ప్రక్రియను వాయిదా వేయాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారతదేశంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ధిగాంచిన మేడారం మహా జాతరకు రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు తరలివెళ్తున్న పరిస్థితుల్లో, మునిసిపల్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణను ప్రారంభిస్తామని ఎన్నికల కమిషన్ ప్రకటించడం అత్యంత దురదృష్టకరమని విమర్శించారు.మేడారం జాతరలో ప్రజలతో పాటు రాజకీయ పార్టీల అభ్యర్థులు, ప్రపోజర్లు, వార్డు సభ్యులు, పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొనే అవకాశం ఉందని పేర్కొన్నారు.ఈ పరిస్థితుల్లో నామినేషన్ ప్రక్రియ సజావుగా సాగడం అసాధ్యమవుతుందని,దీని వల్ల అనేక మంది అభ్యర్థులకు అన్యాయం జరిగే ప్రమాదం ఉందన్నారు.భక్తుల రాకపోకలు, రహదారి రద్దీ, భద్రతా ఏర్పాట్లు వంటి కారణాల వల్ల ప్రజల దృష్టి పూర్తిగా జాతరపైనే ఉంటుందని, ఈ సమయంలో ఎన్నికల ప్రక్రియ చేపట్టడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని అభిప్రాయపడ్డారు.ఈ పరిస్థితిని పరిగణనలోకి తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం మరియు ఎన్నికల కమిషన్ తక్షణమే స్పందించి మునిసిపల్ ఎన్నికల షెడ్యూల్ను వాయిదా వేయాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ భూపాలపల్లి జిల్లా కమిటీ తరఫున ఆయన డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ భూపాలపల్లి జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.