
యువత ఆశలపై నీళ్లు చల్లిన ప్రభుత్వలు: డీవైఎఫ్ఐ
దేశం యువత ఆశలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నీళ్లు చల్లాయని డీవైఎఫ్ఐ హన్మకొండ సౌత్ మండల కార్యదర్శి నోముల కిషోర్ అన్నారు. బుధవారం సుందరయ్య భవన్ లో నిర్వహించిన సమావేశంలో డీవైఎఫ్ఐ మాజీ రాష్టకమిటీ సభ్యులు మంద సంపత్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ అందరికీ విద్య – ఉపాధి అనే లక్ష్యంగా దేశంలో ఉన్న అందరికీ కింద స్థాయి వరకూ నాణ్యమైన విద్య అందించాలని, అదే విధంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ ఉపాధికి కల్పించి జీవనోపాధి కల్పించాలని పోరాడుతుందని అన్నారు. కానీ నేడు అధికారంలో ఉన్న కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ పాలకులు ఉన్న యువత ఆశలని నీరు గార్చుతున్నారని అగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ప్రజల సంపదతో నిర్మితమైన ప్రభుత్వ రంగ పరిశ్రమలను కారు చౌకగా తెగనమ్ముతూ రిజర్వేషన్లను నీరుగార్చుతూ, పరిశ్రమల్లో పని చేసే యువతను రోడ్డున పడేసి, నిరుద్యోగాన్ని పెంచి పోషిస్తున్నారని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రిటైర్మెంట్ అయిన ఖాళీ పోస్టులను భర్తీ చేయడంలో విఫలం అయ్యారని, ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 36 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, అదే విధంగా దేశాన్ని బలమైన దేశంగా ప్రకటించుకునేందుకు కారణమైన దేశ రక్షణ వ్యవస్థను బలహీనపరచే విధంగా యువకుల్లో దేశభక్తి అనే ముసుగు కప్పి అగ్నీపత్ తీసుకొచ్చి యువకుల జీవితాలను నాశనం చేసిందని అన్నారు. మరోపక్క నూతన జాతీయ విద్యా విధానం తీసుకొచ్చి దాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిందని, దీనివలన టీచర్ పోస్టులు భర్తీ చేయకుండా, నిరుద్యోగాన్ని పెంచి పోసించే విధంగా వ్యవహరిస్తుందని, ఇదిలా ఉండగా దేశంలో,రాష్ట్రంలో ఉన్న యువత ఉద్యోగాల్లేక సమస్యలతో ఇబ్బంది పడుతుంటే కులాలు,మతాల మధ్య చిచ్చు పెట్టి లౌకికతత్వాన్ని దెబ్బతీసి, ప్రజాస్వామ్య హక్కులని కాలరాస్తున్నారని, కాబట్టి మన భవిష్యత్తు కోసం, దేశ భవిష్యత్తు కోసం పోరాటం చేయాలని, పోరాటం ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు. అనంతరం డివైఎఫ్ఐ హన్మకొండ సౌత్ మండల అధ్యక్షులు గా మోతె సతీష్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మేరకు నూతన అధ్యక్షులు మాట్లాడుతూ తన ఎన్నికకు సహకరించిన వారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, రచపూడి యువన్, మధు, అనిల్, సందీప్, శివాని, శ్రావణి, ప్రవీణ్, దేవేందర్, కుమార్, మురళి, తదితరులు పాల్గొన్నారు