యూరియా కోసం రైతుల తిప్పలు
ప్రైవేట్ వ్యాపారులు
వద్ద బస్తాకు అదనంగా 100 రూపాయలు”
ధగా పడుతున్న రైతులు”పట్టని వ్యవసాయాధికారులు దేశానికి అన్నం పెట్టే రైతన్న అడుగడుగునా దగా పడుతున్న నేపథ్యం పాలకులు ఎందరు మారినా కొనసాగుతూనే ఉంది.సత్తుపల్లి ప్రాంతంలో గల సత్తుపల్లి,వేంసూరు మండలాలలో గల పల్లెల్లో రైతువ్యధ తెలుసుకుందాం అనే యాత్రను తెలుగుగళం జాతీయ దినపత్రిక ఆర్సీ మల్లూరు చంద్రశేఖర్ చేశారు.దీనిలో ప్రధానంగా దృష్టికి వచ్చిన సమస్య యూరియా కొరత.రైతన్నలు ప్రస్తుతం సాగు చేసే ఆహార,వాణిజ్య పంటలకు పశువుల పెంటపై కాకుండా కాంప్లెక్స్ ఎరువులకు అలవాటు పడిన దుస్థితి ఆ పాపం పాలకులదే.అందరికీ తెలిసిందే పాలకులు కార్పోరేట్ సంస్థలకు కాసులు సంపాదించి పెట్టే దానికి కాంప్లెక్స్ ఎరువుల తయారీ కంపెనీల ఏర్పాటుకు వ్యాపారానికి ఇబ్బడి ముబ్బడిగా అనుమతులు ఇచ్చి రైతాంగాన్ని దోచుకోవడానికి అడ్డగోలుగా అనుమతులు ఇచ్చిన విషయం విదితమే.కాంప్లెక్స్ ఎరువులలో ఏ పంటకు అయినా జవ రావడానికి వాడే కీలక ఎరువు యూరియా అట్టి యూరియా ను ప్రభుత్వం రైతాంగానికి కావలసినంత సరఫరా చేయకుండా చేతులు దులుపుకుంటుంది.మరొక వైపు గ్రామాలలో యూరియా వచ్చాక రైతులు పాస్ బుక్,ఆధార్ నకలు తెచ్చి తీసుకోవాలని అధికారులు చెబుతున్నారు కానీ యూరియా లారీ రేపు వస్తుందనగా ఈరోజే కొందరి పెద్దల జిరాక్స్ లు సహకార సంఘాల సిబ్బంది తీసుకొని వచ్చిన అరకొర బస్తాలు ఆ పెద్దలకు ముట్టజెప్పి చిన్న సన్నకారు రైతులను దగా చేస్తున్నట్లు ఆరోపణలు వినవచ్చాయి.అట్టి యూరియా బస్తాలను పెద్దలు నల్లబజారు కు తరలించి అదనపు ధరకు విక్రయిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.ప్రైవేట్ ఎరువుల దుకాణాల యాజమాన్యాలు కొరతను ఆసరా చేసుకొని ఒక యూరియా బస్తాకు 100 నుండి 150 రూపాయల వరకు అదనపు ధరకు అమ్ముతూ రైతులకు నామం పెడుతున్నట్లు తెలుస్తోంది.కొసమెరుపు ఏమిటంటే దుకాణాల వద్ద ధరల,స్టాక్ పట్టికల్లో మాత్రం యూరియా నిల్వలు చూపించే దానిలో దొంగ లెక్కలు రాస్తూ కొనుగోలు చేసిన రైతులకు రసీదులు కూడా ఇవ్వని పరిస్థితి కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇంత జరుగుతున్న రైతులు దగా పడుతున్న పట్టించుకోవాల్సిన వ్యవసాయశాఖాధికారులు మాత్రం తమకు పట్టదన్నట్లు వ్యవహరిస్తున్న తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.వ్యాపారుల వద్ద నెలవారి మామూళ్లు,బహుమతులు తీసుకుంటూ రికార్డుల పరిశీలనలో చూసి చూడనట్లు సంతకాలు చేస్తూ వ్యాపారుల అక్రమాలకు అండగా ఉంటున్నట్లు విశ్వసనీయ సమాచారం.దీనిపై విజిలెన్స్ అధికారులు దాడులకు పాల్పడి రైతులకు అండగ నిలవాల్సి ఉంది.