
సన్నరకం ధాన్యానికి బోనస్..బోగసేనా ?
జనగామ జిల్లాలో రైతుల వద్ద కొనుగోలు చేసిన సన్నరకం ధాన్యానికి హామీ ఇచ్చిన బోనస్ నిధులను ప్రభుత్వం వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా చందు నాయక్ డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా ఆయన ప్రకటనలో మాట్లాడుతూ..రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో రైతులు పండించే దొడ్డు,సన్నరకం ధాన్యానికి క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇస్తామని హామీ ఇచ్చిందని,కానీ వాస్తవంగా కేవలం సన్నరకం ధాన్యానికే బోనస్ ప్రకటించడమే కాక ఇప్పటికీ అది పూర్తిగా విడుదల చేయలేదని విమర్శించారు.జనగాం జిల్లాలో 5715 మంది రైతుల వద్ద నుంచి సుమారు 2,54,716 క్వింటాళ్ల సన్నరకం ధాన్యం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేయబడిందని,దానికి సంబంధించిన సుమారు రూ.12 కోట్లు బోనస్ ఇప్పటికీ పెండింగ్‌లో ఉందని తెలిపారు.ప్రభుత్వం ఇచ్చిన హామీలు రైతులకు“బోగస్”గా మారుతున్నాయని తీవ్రంగా విమర్శించిన ఆయన,రైతులను నమ్మకద్రోహం చేయడం ఆపి వెంటనే బోనస్ నిధులను జమ చేయాలని డిమాండ్ చేశారు.అలాగే అన్ని రకాల పంటలకు బోనస్ అమలు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.