సర్దార్ @150 యూనిటీ మార్చ్
దేశ ఏకత, సమగ్రతకు ప్రతీకగా నిలిచిన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకొని భూపాలపల్లిలో ‘సర్దార్ @150 యూనిటీ మార్చ్’ను ఘనంగా నిర్వహించారు. మంగళవారం అంబేద్కర్ స్టేడియం నుండి జయశంకర్ సెంటర్ వరకు నిర్వహించిన ఈ ఏకతా మార్చ్‌కు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు,జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
మేరా యువ భారత్ పోర్టల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ మార్చ్‌ను ఇద్దరు ప్రజాప్రతినిధులు జెండా ఊపి ప్రారంభించారు.పెద్ద సంఖ్యలో విద్యార్థులు,యువత, స్వచ్ఛంద సంస్థలు, అధికారులు, సామాజిక సంఘాలు యూనిటీ మార్చ్‌లో పాల్గొని దేశ ఏకతకు అంకిత భావంతో నడిచారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు—
“సర్దార్ వల్లభాయ్ పటేల్ నిస్వార్థ సేవ, ఏకత, పరిపాలనా దక్షతకు శాశ్వత చిహ్నం. దేశంలోని 562 సంస్థానాలను భారతదేశంలో విలీనం చేసి సమగ్ర భారత నిర్మాణానికి పునాదులు వేసింది ఆయన నాయకత్వమే. అలాంటి మహానేతను స్మరించుకోవడం ప్రతి భారతీయుడి గౌరవకరమైన కర్తవ్యమే” అని అన్నారు.
యువత దేశ అభివృద్ధి, జాతీయ సమగ్రతలో ముందుండాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే—
“సర్దార్ పటేల్ చూపిన సేవామార్గం, ఆయన తీసుకున్న ధైర్య నిర్ణయాలు నేటి తరానికి స్ఫూర్తి. దేశ ఏకత, అభివృద్ధి వంటి మహత్తర లక్ష్యాల కోసం ఇలాంటి యూనిటీ మార్చ్‌లు యువతలో జాతీయ భావనను పెంపొందిస్తాయి” అని పేర్కొన్నారు.కార్యక్రమంలో పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు, యువజన సంఘాల నాయకులు పాల్గొన్నారు.