అంబేద్కర్ విగ్రహ నిర్మాణాన్ని అడ్డుకుంటున్న వారిపై చర్యలు తీసుకోవాలి
Nalgondaకెవిపిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పాలడుగు నాగార్జున
దళితులు రూపాయి రూపాయి కూడా వేసుకొని అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడానికి స్వచ్చందంగా పిల్లర్ ను నిర్మించుకుంటున్న క్రమంలో లెంకలపల్లి గ్రామానికి చెందిన కొంత మంది ఆధిపత్య వర్గాలకు చెందిన వారు అడ్డుకుంటున్నారని సమాచారమివ్వగా కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పాలడుగు నాగార్జున నేతృత్వంలో శుక్రవారం లెంకలపల్లి గ్రామానికి వెళ్లి విగ్రహ ప్రతిష్టాపనకు జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించి ఎవరు అడ్డుకుంటున్నారు.? ఎందుకు అడ్డుకుంటున్నారు.? అక్కడ ఉన్న దళితులను, గ్రామ పెద్దలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం అక్కడ జరుగుతున్న పరిణామాలను మీడియా కు తెలియజేశారు. ఈ సందర్భంగా కెవిపిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పాలడుగు నాగార్జున మాట్లాడుతూ విగ్రహం ఏర్పాటు చేయబోవు ప్రభుత్వ,దళితుల స్థలాన్ని అక్రమంగా ఆక్రమించుకోవడానికి కొన్ని ఆధిపత్య కులాలు కుట్రలు చేస్తూ అడ్డుకుంటున్నారని తక్షణమే వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దళితులమైన మేము మా భూములలో స్వసిద్దంగా ఏర్పాటు చేసుకుంటుంటే అభ్యంతరం చెప్పడానికి ఆధిపత్య కులాలు ఎవరన్నారు.? మేమేమైనా వాల్ల భూములలో విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటున్నామా.! లేదా వాళ్ళ భూముల్లోకి ఏమైనా అక్రమంగా ప్రవేశించామా.! అనవసరంగా మా విగ్రహ ఏర్పాటు విషయంలో జోక్యం చేసుకుంటే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. మాకు నోటీసులు పంపడం ఏమిటని ప్రశ్నించారు. ఏ అధికారం ఉందని వారి సొంత భూమి నా లేక పట్టా భూముల మాకెందుకు నోటీసులు పంపించారని దళితులు ప్రశ్నిస్తున్నారని అన్నారు. అడ్డుకుంటున్న వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక ఎస్సై ఎంఆర్ఓ దళితులకు రక్షణ కల్పించాలని కోరారు. ఇట్టి విషయంపై సోమవారం రోజున జిల్లా కలెక్టర్,జిల్లా ఎస్పీని పెద్ద ఎత్తున దళిత గిరిజన బిసి సామాజిక సంఘాలతో కలిసి విన్నవిస్తామని వారన్నారు. అనంతరం చలో లెంకలపల్లి కార్యక్రమం కూడా ఒకరోజు నిర్వహిస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షులు పందుల సైదులు, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా సహాయ కార్యదర్శి మునుగోడు నియోజకవర్గం కెవిపిఎస్ ఇన్చార్జి బొట్టు శివకుమార్ ఆ గ్రామ దళితులు ఈసర్లపు లింగస్వామి,ఏర్పుల రమేష్, ఏర్పుల కృష్ణ, యాదయ్య, వరికుప్పల ఈదయ్య, మల్లయ్య, అయితగోని పాపయ్య పాక కిరణ్, దామర యాదయ్య, మానుపాటి అంజయ్య, కల్మర రాములు తదితరులు పాల్గొన్నారు.