అర్హులైన వారికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు వెంటనే కేటాయించాలి.
Hyderabad
Date: 28/11/2022
-ఎం.డి. అబ్బాస్ ప్రజాసంఘాల పోరాటవేదిక రాష్ట్ర నాయకులు
- ప్రజా సంఘాల పోరాట వేధిక ఆధ్వర్యంలో హైదరాబాద్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా. ఇండ్లు లేని పేద ప్రజలకు ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానం ప్రకారం తక్షణం డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించాలని ప్రజా సంఘాల పోరాట వేదిక రాష్ట్ర నాయకులు ఎండీ.అబ్బాస్ డిమాండ్ చేశారు. తక్షణం ఇండ్లు కేటాయించకపోతే నగరంలో కట్టిన ఇండ్లను పేద ప్రజలకు మేమే కేటాయిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇండ్లకు నెల నెలా కిరాయిలు చెల్లించలేక బాధపడ్తున్న వందలాది పేద కుటుంబాలు ధర్నాలో నినాదాలు చేశారు. ధర్నాకు ముఖ్య అతిథిగా హాజరైన ఎం.డి.అబ్బాస్ ధర్నాను ద్దేశించి మాట్లాడుతూ కొన్ని నెలల్లో పూర్తి కావాల్సిన నిర్మాణాలు నత్తనడకన సాగుతున్నాయి, ఏళ్ళు గడిచినా పూర్తి కావడం లేదు. గతంలో నిర్మించిన రాజీవ్ గృహకల్ప, వాంభే స్కీం ఇళ్ళు వేలల్లో ఉన్నాయి. నిర్మాణం పూర్తైన డబుల్ బెడ్రూం ఇళ్ళు ఉన్నాయి. వాటిని కేటాయించడంలో ప్రభుత్వం తాత్సారం చేస్తోందని విమర్శించారు. నగరంలో కూలి పనులు సరిగ్గా దొరకక, ఇండ్ల కీరాయిలు కట్టలేక అప్పుల పాలవుతున్నారు. పేదల ఆగ్రహం చవిచూడక ముందే పూర్తయిన ఇండ్లను అర్హులైన వారికి త్వరగా కేటాయించాలని కోరారు. ప్రజలు ఆర్థికంగా కష్టాలలో ఉంటే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిత్యావసర ధరలను విపరీతంగా పెంచి భారం వేస్తున్నదని, ఇబ్బందులతో ప్రజలు అర్థాకలితో జీవిస్తున్నారని అన్నారు. ప్రభుత్వ భూములు, సహజ వనరులను బడా కంపెనీలు దోచుకునే విధానాలు కేంద్రం అమలు చేస్తున్నదని, పేదలకు కనీసం నిలువ నీడ లేకుండా చేస్తున్నదని విమర్శించారు. అనంతరం సీఐటీయూ, ఐద్వా, ఆవాజ్, డివైఎఫ్ఐ,గిరిజన సంఘం తదితర ప్రజాసంఘాల హైదరబాద్ సౌత్ జిల్లా నాయకులు ఎండీ.అబ్బాస్, జి.విఠల్, ఎల్ కోటయ్య, శ్రావణ్ కుమార్, పి.శశికళ, అఫ్జల్ బేగం, తదితరులు అడిషనల్ కలెక్టర్ వెంకటేశంకు వినతి ఇచ్చారు. ఉన్నతాధికారులతో మాట్లాడి తగిన విధంగా పేదలకు న్యాయం జరిగేలా చూస్తామని వాగ్దానం చేశారు.
ధర్నాలో సౌత్ జిల్లా ప్రజాసంఘాల నాయకులు అబ్దుల్ సత్తార్, లతీఫ్, పి.నాగేశ్వర్, ఎం.మీనా, కె.జంగయ్య, బాలు, ఎస్.కిషన్, రాంకుమార్, ఎం.లక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నారు.