
రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళీ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళీ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
మంచి రోడ్లు ఉన్నప్పుడే అభివృద్ధి సాధ్యం
కుటుంబంలో ఒకరు బాగా చదువుకుంటే పేదరికం దూరం
లాభసాటి పంటలు ఆయిల్ పామ్ సాగు చేసి రైతులు బాగుపడాలి
ఖమ్మం :
ఆదర్శవంతంగా రఘునాథ పాలెం మండలం తీర్చిదిద్దుతున్నామని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళీ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.
బుధవారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రఘునాధపాలెం మండల కేంద్రంలో పర్యటించి 30 లక్షలతో చేపట్టిన ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘ భవనం మౌళిక సదుపాయ, కాంపౌండ్ గోడ నిర్మాణ పనులకు, ఎం.జి.ఎన్.ఆర్.ఈ.జి. ఎస్. నిధులు రెండు కోట్ల 33 లక్షలతో నిర్మించనున్న అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణ పనులకు, సి.ఆర్.ఆర్. నిధులు ఒక కోటి రూపాయల అంచనా వ్యయంతో రఘునాథపాలెం రైస్ మిల్ నుండి ఖమ్మం ఇల్లందు రోడ్డు వరకు నిర్మించనున్న బి.టి. రోడ్డు నిర్మాణ పనులకు, సి.ఆర్.ఆర్. (ఎస్.సి.పి.) నిధులు ఒక కోటి 10 లక్షలతో ఎస్సీ కాలనీలో నిర్మించనున్న అంతర్గత సీసీ రోడ్లు, డ్రైన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, రోడ్లపై నీరు రాకుండా చూసుకోవడం, రోడ్లపై ఆక్రమణలు జరగకుండా చూడాలని అన్నారు. ప్రజలు ఒప్పుకుంటే మెయిన్ రోడ్ విస్తరణకు చర్యలు తీసుకుంటామని అన్నారు. మంచి రోడ్లు ఉన్నప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని, నాగపూర్ నుంచి అమరావతికు జాతీయ రహదారి వస్తుందని, భూములు కోల్పోయే రైతులకు ముందు 15 లక్షలు ఎకరానికి ఇస్తామని చెబితే, తాను కొట్లాడి 35 లక్షలు ఇప్పించానని మంత్రి అన్నారు. ఖమ్మం నగరానికి చుట్టు రింగ్ రోడ్డు వస్తుందని అన్నారు. భూములు కోల్పోయిన రైతులకు దేశంలో ఎక్కడా ఎకరానికి 35 లక్షలు ఇచ్చిన దాఖలాలు లేవని, కేంద్ర ప్రభుత్వంతో తాను కొట్లాడి ఇప్పించానన్నారు. ఇదే జాతీయ రహదారికి ఆంధ్రప్రదేశ్ లో భూసేకరణ పరిహారం క్రింద 13 లక్షలు మాత్రమే వచ్చాయని తెలిపారు. రఘునాధపాలెం
లోనే 200 కోట్లతో యంగ్ ఇండియా సమీకృత గురుకులం, వైద్య కళాశాల నిర్మిస్తున్నామని అన్నారు. విద్యతోపాటు క్రీడలను కూడా ప్రోత్సహిస్తూ యంగ్ ఇండియా విద్యా సంస్థలను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు.రఘునాధ పాలెంలో స్టేడియం, ప్రపంచంలో 130 దేశాలలో విద్యాసంస్థలు నడిపే స్వామి నారాయణ సంస్థను ఇక్కడ ఏర్పాటు చేస్తున్నామని, దీని ద్వారా గిరిజనులకు ఉచితంగా విద్య అందుతుందని అన్నారు.
కుటుంబంలో ఒకరు బాగా చదువుకుంటే పేదరికం దూరం అవుతుందని అన్నారు. మండలంలోని 36 చెరువులకు సమృద్ధిగా జూలై వరకు నీరు విడుదల అవుతుందని, అవసరమైన పైప్ లైన్ పనులు పూర్తి చేయాలని అన్నారు.నీటి సమస్య ఇకపై ఉండదని రైతులు లాభసాటి పంటల ఆయిల్ పామ్ సాగు చేయాలని, అంతర్ పంటలు సాగు ద్వారా ఆదాయం లభిస్తుందని, ప్రతి ఎకరానికి 51 వేల రూపాయల వరకు సబ్సిడీ కల్పించి డ్రిప్ సౌకర్యం మొక్కలు అందిస్తామని అన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ ల ఉచిత విద్యుత్తు, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ సరఫరా, పేదలకు సన్న బియ్యం, ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు, 2 లక్షల రుణమాఫీ, సన్న వడ్లకు క్వింటాల్ 500 రూపాయల బోనస్ వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను ఆర్ధిక కష్టాలు ఉన్నప్పటికీ ప్రభుత్వం అమలు చేస్తుందని తెలిపారు. బుగ్గ వాగు దగ్గర కాలువ పనులు ఆలస్యం అవుతున్నాయని లిఫ్ట్ పనులు చేపట్టామని, త్వరలో కాలువ పనులు కూడా పూర్తి చేస్తామని అన్నారు. వర్షాలు ఉన్నప్పుడు గ్రావిటీ ద్వారా, లేని పక్షంలో లిఫ్ట్ ద్వారా ప్రజలకు తప్పనిసరిగా నీరు అందిస్తామని అన్నారు. ప్రభుత్వం ఇచ్చే పథకాలను వినియోగించుకుంటూ సమాజంలో మనం నిలబడాలని, ప్రతిదానికి ప్రభుత్వం సహాయం చేయాలంటే కుదరదని, మనం కట్టే పన్నులు మాత్రమే మనకు వస్తున్నాయని మంత్రి తెలిపారు. అనంతరం మత్స్యకార మహిళా సహకార సంఘం సభ్యులకు గుర్తింపు కార్డులను పంపిణీ చేసారు. అంతకుముందు మంత్రి, వైద్య కళాశాల నిర్మాణ ప్రదేశాన్ని పరిశీలించి శంకుస్థాపన పనుల ఏర్పాట్లపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. బాలాపేట-బల్లెపల్లి వద్ద జరుగుతున్న కాల్వ పనులను పరిశీలించి, అధికారులకు సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి, ఖమ్మం ఆర్డీవో జి. నర్సింహారావు, ఆర్ అండ్ బి ఎస్ఇ యాకుబ్, జిల్లా మత్స్య శాఖ అధికారి శివప్రసాద్, పీఆర్ ఇఇ వెంకట్ రెడ్డి, మిషన్ భగీరథ ఇఇ పుష్పలత, ప్రజాప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.