ఈ69న్యూస్ జనగామ,సెప్టెంబర్ 5 జనగామ జిల్లా జఫర్గడ్ మండల సీనియర్ నాయకుడు,ఓబులాపూర్ గ్రామానికి చెందిన కామ్రేడ్ మొగలగాని చిన్న రాములు (65) శుక్రవారం ఉదయం 10:30 గంటలకు హనుమకొండలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.ఆయన మృతి పట్ల పార్టీ శ్రేణులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.1983లో తమ్మడపల్లి (జి) గ్రామంలో సీపీఎం సభ్యత్వం తీసుకున్న చిన్న రాములు,నాలుగు దశాబ్దాలపాటు పార్టీకి అంకితభావంతో సేవలందించారు.ప్రజా సమస్యల పరిష్కారం కోసం అనేక పోరాటాల్లో ముందుండి పాల్గొన్నారు.ప్రతి ఎన్నికల్లో ఓబులాపూర్ గ్రామ పంచాయతీలో సీపీఎంకు ప్రాతినిధ్యం సాధించడంలో కీలక పాత్ర పోషించారు.వ్యక్తిగత జీవితం ఎంతటి కష్టాల్లో ఉన్నా పార్టీ పనులపై ఎప్పటికీ వెనకడుగు వేయని నాయకుడిగా గుర్తింపు పొందారు.తన కుమారుడు ప్రమాదంలో మరణించిన తర్వాత కూడా కుటుంబానికి,మనవళ్లకు అండగా నిలిచారు.సహచర కార్యకర్తలతో ఆప్యాయతతో,స్నేహపూర్వకంగా వ్యవహరించిన చిన్న రాములు తరచూ పార్టీ సహచరులను సంప్రదిస్తూ ఉత్సాహపరచేవారు.చిన్న రాములు మరణం పార్టీకి తీరనిలోటు.ఆయన నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి 45 ఏళ్ల పాటు ఎర్రజెండాను ఎత్తిపట్టడం విశేషం”అని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు రాపర్తి రాజు సంతాపం తెలిపారు.వారి కుటుంబానికి సీపీఎం నాయకులు,కార్యకర్తలు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.