కలిసి కదలుదాం.. బలంగా పోరాడుదాం!
Uncategorized– టిడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు సోమయ్య

ఈ69న్యూస్ షాద్ నగర్
రాష్ట్రంలోని జర్నలిస్టుల హక్కుల కోసం సంయుక్తంగా ఉద్యమించాలన్న సంకల్పంతో టిడబ్ల్యూజేఎఫ్ షాద్ నగర్ డివిజన్ సమావేశం ఘనంగా జరిగింది. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ సమీపంలోని నాగులపల్లి గ్రామ శివారులో ఉన్న స్వదేశీ కంట్రీ సైడ్ రిసార్ట్స్ వేదికగా ఈ సమావేశం ఆదివారం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో 77 మంది సీనియర్ జర్నలిస్టులు టిడబ్ల్యూజేఎఫ్ సభ్యత్వం తీసుకొని సంఘంలో చేరారు.
సమావేశానికి రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షులు బండి విజయకుమార్, జగన్, జిల్లా కార్యదర్శి సైదులు, జాతీయ కౌన్సిల్ సభ్యులు దేవేందర్, రఘుపతి రెడ్డి తదితరులు హాజరై నాయకత్వం వహించారు. రాష్ట్ర నాయకులను స్థానిక జర్నలిస్టులు శాలువాలు కప్పి ఘనంగా సత్కరించగా, అనేకమంది సీనియర్ జర్నలిస్టులను ప్రత్యేకంగా గౌరవించారు.
జర్నలిస్టుల సమస్యలపై పోరాటం మళ్లీ మొదలైంది: సోమయ్య
ఈ సందర్భంగా టిడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు సోమయ్య మాట్లాడుతూ, గత ప్రభుత్వం జర్నలిస్టులకు ఎన్నో వాగ్దానాలు ఇచ్చి మోసం చేసిందని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ తీరు కూడా అలాగే సాగుతోందని విమర్శించారు. జర్నలిస్టుల సమస్యలు పెరిగినా, వాటిని పరిష్కరించేందుకు యూనియన్లు సరైన పాత్ర పోషించలేకపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. “ప్రత్యక్ష పోరాటాలకు సిద్ధం కావాలి. రాష్ట్ర వ్యాప్తంగా మహాసభల తర్వాత సమస్యలపై తీవ్రంగా ఉద్యమించాల్సిన అవసరం ఉంది” అని పిలుపునిచ్చారు.
కేపీ భావజాలానికి సరైన వేదిక టిడబ్ల్యూజేఎఫ్: బండి విజయ్ కుమార్
రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండి విజయ్ కుమార్ మాట్లాడుతూ, సీనియర్ జర్నలిస్టు కేపీ వంటి ప్రజ్ఞావంతుల భావజాలానికి టిడబ్ల్యూజేఎఫ్ సంఘమే సరైన వేదిక అని పేర్కొన్నారు. “అక్రిడిటేషన్, హెల్త్ కార్డులు, ఇళ్లు, విద్య – ఇలా జర్నలిస్టులకు అవసరమైన అంశాలపై పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని” పేర్కొన్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో జర్నలిస్టుల పిల్లలకు 50% ఫీజు రాయితీ కోసం కూడా ఉద్యమం అవసరమని పేర్కొన్నారు.
పవిత్రమైన జర్నలిజం వృత్తిలో చిత్తశుద్ధితో ముందడుగు వేయాలి: ఎల్. మోహన్ రెడ్డి
సీనియర్ జర్నలిస్టు లట్టుపల్లి మోహన్ రెడ్డి మాట్లాడుతూ, జర్నలిజం వృత్తి ఎంతో పవిత్రమైనదని, దీన్ని ఆర్థిక ప్రయోజనాల కోసమే చేయకూడదని, ఇది ఆసక్తి, సేవా దృక్పథంతో కొనసాగించాల్సిన వృత్తి అని పేర్కొన్నారు. “ఇతర వృత్తుల ద్వారా ఉపాధి పొందుతూ జర్నలిజాన్ని కొనసాగించాలి” అని సూచించారు.
కేపీ మాటల్లో: సొంత ఇంటికి వచ్చిన సంతోషం
సీనియర్ జర్నలిస్టు కేపీ మాట్లాడుతూ, గతంలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో టిడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షుడిగా, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడిగా సేవలందించిన తాను తిరిగి తన స్వంత యూనియన్‌కు వచ్చానన్న సంతోషాన్ని వ్యక్తపరిచారు. “ఈ యూనియన్ ద్వారా నిజమైన జర్నలిజం భావజాలానికి న్యాయం జరుగుతుంది” అని అన్నారు.
హాజరైన ప్రముఖులు:
ఈ కార్యక్రమంలో భవాని వేణు గోపాల్, టంగుటూరి సంజయ్ కుమార్, సారపు రమేష్, మన్సూర్ అలీ ఖాన్, రాఘవేందర్ గౌడ్, నరసింహారెడ్డి, నరేష్, లక్కాకుల రమేష్, బోబ్బిలి ప్రవీణ్, మసలీయుద్దీన్, వహీద్, మల్లేష్, దిశ ఆర్కే, విష్ణు, రాజశేఖర్, వెంకటేష్, హర్షద్, మూయిస్, కృష్ణ, సాయి, మల్చలం రాము, ఇక్బాల్, చంద్రశేఖర్, ధర్మపాల్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.